Cars Without Spare Tyre: స్పేర్ టైర్ లేకుండా వస్తున్న కార్లు - ఇది సురక్షితమేనా లేక ఖర్చు తగ్గించే ట్రిక్కా?
ఇప్పుడు చాలా కార్లు స్పేర్ టైర్ లేకుండా వస్తున్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, TPMS, పంక్చర్ రిపేర్ కిట్లు ఉన్నా.. భారత రోడ్లపై ఇది నిజంగానే సేఫేనా లేక ఖర్చు తగ్గించే ట్రిక్కా?

Car Tyre Puncture Repair Kit Usage: కార్లలో ఒక స్పేర్ టైర్ (అదనపు టైరు) తప్పనిసరిగా ఉండడం మనం చాలాకాలం నుంచి చూస్తున్నాం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. Maruti Suzuki Victoris నుంచి Tata Punch EV, Tata Tiago EV వరకూ కొత్త కార్లలో స్పేర్ టైర్ ఇవ్వడం ఆపేశారు. దీంతో ఒక డౌట్ రావడం సహజం - ఇకపై భారత రోడ్లపై స్పేర్ టైర్ అవసరం ఉండదా?.
స్పేర్ టైర్ ఎందుకు తీసేస్తున్నారు?
వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం, 2020లో ఒక రూల్ మార్చింది. ట్యూబ్‌లెస్ టైర్లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), పంక్చర్ రిపేర్ కిట్ ఉన్న వాహనాలకు స్పేర్ టైర్ అవసరం లేదని చెప్పింది. దీంతో కంపెనీలు స్పేర్ టైర్ తీసేయడం మొదలు పెట్టాయి.
ఇందుకు ప్రధాన కారణాలు ఇవి:
రోడ్ల పరిస్థితులు కాస్త మెరుగుపడటం
టైర్ల క్వాలిటీ పెరగడం
మెయింటెనెన్స్‌పై కారు ఓనర్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టడం
TPMS, పంక్చర్ రిపేర్ కిట్ లాంటి టెక్నాలజీ రావడం
పంక్చర్ షాపులు సులభంగా అందుబాటులో ఉండటం
స్పేర్ టైర్ లేకపోతే కారు తేలికగా ఉండటం, మైలేజ్ పెరగడం
స్థలం ఆదా కావడం వల్ల అదనపు స్టోరేజ్ ఇవ్వగలగడం
స్పేర్ టైర్ ప్రయోజనాలు
చాలామంది డ్రైవర్లకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్. లాంగ్ ట్రిప్ మధ్యలో పంక్చర్ పడినా వెంటనే టైర్ రిప్లేస్ చేసుకోవచ్చు.
టైర్ రొటేషన్‌లో 5 టైర్లు వాడితే టైర్ల లైఫ్ ఎక్కువ అవుతుంది.
ఫుల్ సైజ్ స్పేర్ టైర్ ఉంటే ఎటువంటి స్పీడ్ లిమిట్ ఇబ్బంది ఉండదు.
స్పేర్ టైర్ లోపాలు
బూట్‌స్పేస్ తక్కువ అవుతుంది. SUVలలో కింద పెట్టిన టైర్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను తగ్గిస్తుంది.
కారు ధర పెరుగుతుంది, టూల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
వెయిట్ పెరగడంతో మైలేజ్ తగ్గుతుంది.
చిన్న స్పేస్‌సేవర్ టైర్లు అయితే స్పీడ్ లిమిట్ ఉంటుంది.
ఒకసారి వాడాక రెండోసారి పంక్చర్ అయితే ఇబ్బంది తప్పదు.
పంక్చర్ రిపేర్ కిట్ ప్రయోజనాలు
కాంపాక్ట్ సైజ్‌లో వస్తుంది, బూట్‌లో స్పేస్ ఎక్కువ తీసుకోదు.
వాహనానికి టైర్ ఉండగానే పంక్చర్ రిపేర్ చేయవచ్చు.
ఒక్కసారి కాదు, చాలాసార్లు వాడుకోవచ్చు.
పంక్చర్ రిపేర్ కిట్ లోపాలు
కొంత ప్రాక్టీస్ అవసరం. మొదటిసారి పంక్చర్ రిపేర్ చేసేవాళ్లకు కష్టంగా అనిపిస్తుంది.
టైర్ సైడ్‌వాల్ డ్యామేజ్ అయితే రిపేర్ చేయడం అసాధ్యం.
స్పేర్ టైర్ లేకపోవడం నిజంగా సేఫేనా లేక ఖర్చు తగ్గించడమా?
కొంతమంది దీన్ని కాస్ట్ కట్టింగ్ అంటున్నారు. నిజమే, స్పేర్ టైర్ తీసేస్తే కంపెనీకి ఖర్చు తగ్గుతుంది. ఆ డబ్బుతో ఇతర ఫీచర్లను ఇవ్వొచ్చు. ఉదాహరణకి - సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, బెటర్ సౌండ్ సిస్టమ్. అలాగే వెయిట్ తగ్గడం వల్ల మైలేజ్ కాస్త పెరుగుతుంది.
నిజం చెప్పాలంటే, భారత రోడ్లు ఇప్పటికీ 100% సేఫ్ కావు. వర్షాల టైమ్‌లో పంక్చర్లు తప్పవు. కాబట్టి, స్పేర్ టైర్ ఉండడం వల్ల డ్రైవర్లకు మానసికంగా ఒక సేఫ్టీ ఫీలింగ్ & ధైర్యం ఉంటుంది. అయితే, కొత్త జనరేషన్ డ్రైవర్లకు TPMS, రిపేర్ కిట్ చాలు అనిపిస్తోంది. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ (మార్పు కాలం). భవిష్యత్తులో స్పేర్ టైర్ పూర్తిగా మాయమైపోవడం ఖాయంగా కనిపిస్తోంది.





















