Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
టూవీలర్లలోనూ కార్ల తరహా స్మార్ట్ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ABS, టైర్ ప్రెషర్ మానిటరింగ్, జియో ఫెన్సింగ్, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాల గురించి తెలుసుకోండి.

Smart Features in Bikes And Scooters: ఇప్పటి ద్విచక్ర వాహనాల్లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కార్లలో మాత్రమే కనిపించిన ఆధునిక సాంకేతికతలు ఇప్పుడు బైక్‌లు, స్కూటర్లలోనూ అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ స్క్రీన్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ నుంచి సేఫ్టీని పెంచే సదుపాయాల వరకు ఎన్నో కొత్త ఫీచర్లు రైడర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనివల్ల ద్విచక్ర వాహనాల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతోంది. అయితే, అన్ని ఫీచర్లు ప్రతి వాహనంలోనూ ఉండవు. కంపెనీ, మోడల్, రేటును బట్టి సదుపాయాలు మారుతుంటాయి.
డిజిటల్ స్క్రీన్‌తో ఎన్నో ప్రయోజనాలు
గతంలో బైక్‌లలో వేగాన్ని చూపించే సాధారణ మీటర్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో డిజిటల్ స్క్రీన్‌లు వచ్చాయి. వీటిపై వేగం, ప్రయాణ దూరం, బ్యాటరీలో మిగిలిన ఛార్జింగ్, సమయం వంటి వివరాలను చూడొచ్చు. కొన్ని వాహనాల్లో ఫోన్‌కు వచ్చే కాల్స్, సందేశాల వివరాలు కూడా కనిపిస్తాయి. బ్లూటూత్ ద్వారా ఫోన్‌ను అనుసంధానించుకోవచ్చు. కొన్ని మోడళ్లలో.. ప్రయాణ వివరాలను తెలుసుకోవడం, స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని మార్చుకోవడం వంటి సదుపాయాలూ ఉన్నాయి.
ABSతో మెరుగైన భద్రత
బైక్ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంశం బ్రేకింగ్. అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అయి వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ABS ఉపయోగపడుతుంది. చక్రాల వేగాన్ని సెన్సర్ల ద్వారా గుర్తించి, అవసరానికి అనుగుణంగా బ్రేకుల ఒత్తిడిని నియంత్రిస్తుంది. దీంతో చక్రాలు లాక్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
సింగిల్ ఛానల్ ABS సాధారణంగా ఒక చక్రానికి, డ్యూయల్ ఛానల్ ABS రెండు చక్రాలకు బ్రేకింగ్ నియంత్రణ అందిస్తుంది. కొన్ని అధునాతన వాహనాల్లో మలుపుల్లోనూ బ్రేకింగ్ నియంత్రణకు సహాయపడే కార్నరింగ్ ABS ఉంటుంది. అయితే, ABS ఉన్నంత మాత్రాన ప్రమాదాలు జరగవని భావించకూడదు. వేగ నియంత్రణ, సురక్షిత దూరం పాటించడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: 2026 Maruti Balenoలో లెవల్ 2 ADAS ఫీచర్లు.. టాప్ వేరియంట్‌లో ఇంకా ఏం ఉన్నాయో తెలుసా?
టైర్లలో గాలి తగ్గితే వెంటనే సమాచారం
టైర్లలో సరైన గాలి ఉండటం ప్రయాణ భద్రతకు అవసరం. గాలి తగ్గిన విషయాన్ని గుర్తించకపోతే వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షిస్తుంది. కొన్ని వ్యవస్థలు ఉష్ణోగ్రత వివరాలను కూడా అందిస్తాయి. గాలి ఒత్తిడి తగ్గినప్పుడు హెచ్చరికలు ఇస్తాయి. ఈ సదుపాయం లేని వాహనాలకు అనుకూలమైన పరికరాలను విడిగా అమర్చుకోవచ్చు.
దొంగతనాన్ని గుర్తించే సాంకేతికత
స్మార్ట్ ఫీచర్లలో జియో ఫెన్సింగ్ కూడా ముఖ్యమైనది. ముందుగా నిర్ణయించిన పరిధిని మీ వాహనం దాటినప్పుడు ఫోన్‌కు హెచ్చరిక వచ్చేలా కొన్ని మోడళ్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. వాహనం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు లైవ్ లొకేషన్, ట్రాకింగ్ సదుపాయాలు ఉపయోగపడతాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా వాహనాన్ని పర్యవేక్షించవచ్చు.
కొండ మార్గాల్లో ఆటో హోల్డ్
ఎత్తైన ప్రాంతాల్లో వాహనాన్ని ఆపి మళ్లీ ముందుకు కదిలించేటప్పుడు వెనక్కి జారకుండా సహాయపడే సదుపాయాన్ని హిల్ హోల్డ్ అసిస్ట్/ఆటో హోల్డ్ అంటారు. ఆటో హోల్డ్ వంటి వ్యవస్థలు కొన్ని వాహనాల్లో అదనపు సౌకర్యాన్ని అందిస్తాయి. వాహనం కిందపడినప్పుడు విద్యుత్ సరఫరా లేదా ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేసే ఫాల్ సేఫ్ సదుపాయం కూడా ప్రమాదం తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: డ్రైవింగ్ లైసెన్స్‌లో సరికొత్త మార్పులు.. రంగులతోనే గుర్తింపు! బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్ తప్పనిసరి?
ఇంకా ఎన్నో అధునాతన సదుపాయాలు
క్రూయిజ్ కంట్రోల్ ద్వారా స్థిరమైన వేగాన్ని కొనసాగించవచ్చు. రివర్స్ మోడ్‌తో కొన్ని స్కూటర్లను వెనక్కి కదిలించడం సులభమవుతుంది. కీలెస్ స్టార్ట్ సదుపాయం ఉంటే సంప్రదాయ తాళం అవసరం లేకుండా వాహనాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఇన్‌బిల్ట్ నావిగేషన్ ద్వారా గమ్యస్థానానికి వెళ్లే మార్గాన్ని స్క్రీన్‌పై చూడొచ్చు. కొన్ని టూవీలర్లలో స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, డ్యాష్‌క్యామ్ సపోర్ట్, స్క్రీన్‌పై డే & నైట్ మోడ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు దాని లుక్, స్పీడ్, రేటు మాత్రమే కాకుండా భద్రత సదుపాయాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ABS, TPMS, వాహనాన్ని లైవ్‌లో గుర్తించే సాంకేతికత వంటి అంశాలను పరిశీలించాలి. స్మార్ట్ ఫీచర్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కానీ సురక్షితమైన డ్రైవింగ్‌కు ప్రత్యామ్నాయం కావు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, వేగాన్ని నియంత్రించడం ప్రతి వాహనదారుడి తప్పనిసరి బాధ్యత.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















