Renault Kiger Vs Tata Punch: ఎక్స్‌క్లూజివ్: రెనో కిగర్ వర్సెస్ టాటా పంచ్
ప్రస్తుతం మనదేశంలో ఎస్‌యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా లాంచ్ అయిన రెనో కిగర్, టాటా పంచ్‌ల్లో మంచి ఫీచర్లను కంపెనీలు అందించాయి. మరి వీటిలో ఏది బెస్ట్ అంటే?
ఇప్పుడు కొత్తగా కార్లు కొనుగోలు చేసే వారందరూ ఎస్‌యూవీల వైపే చూస్తున్నారు. ఎందుకంటే వీటి సైజ్ చిన్నగా ఉండటంతో పాటు చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. గతంలో హ్యాచ్‌బ్యాక్ కార్లు కొనాలనుకున్నవారు కూడా ఇప్పుడు చిన్న ఎస్‌యూవీల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న రోడ్లు, ట్రాఫిక్‌కు సరిపోవాలంటే.. చిన్న మైక్రో ఎస్‌యూవీలే కరెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. దీంతో ఈ విభాగంలో పోటీ పెరిగింది. కియా సోనెట్ వంటి కొంచెం పెద్ద సైజులో ఉండే ఎస్‌యూవీలతో పాటు చిన్న ఎస్‌యూవీలు కూడా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. రెనో కిగర్‌తో పాటు తాజాగా లాంచ్ అయిన టాటా పంచ్ కూడా ఇదే విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ ఒకసారి పోల్చి ఏది బెస్టో చూద్దాం..
1. లుక్స్
ఈ రెండిటి హెడ్ ల్యాంప్స్ తాజా ఎస్‌యూవీ ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్నాయి. వీటి డీఆర్ఎల్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవి ప్రీమియం ఎస్‌యూవీ లుక్‌ను అందించనున్నారు. వాటి సాధారణ సైజు కంటే కాస్త పెద్దగా ఉండటంతో అందరి దృష్టి వీటిపైనే ఉంటుంది. రూఫ్ రెయిల్స్, క్లాడింగ్ వంటివి వీటికి అదనపు ఆకర్షణ. పంచ్ కంటే కిగర్ కాస్త పొడుగ్గా, వెడల్పుగా ఉండనుంది. అయితే మరీ అంత పెద్దది కూడా కాదు. ఈ రెండిట్లోనూ 16 అంగుళాల అలోయ్ వీల్స్‌ను అందించనున్నారు. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.
2. ఇంటీరియర్స్
వీటిలో పంచ్ డిజైన్ కాస్త వెరైటీగా ఉండనుంది. ఇందులో రంగులతో కూడిన వెంట్స్, వైట్ ప్యానెల్ ఉండనుంది. అయితే కిగర్ క్యాబిన్ మాత్రం చూడటానికి బ్లాక్ లుక్‌తో పాటు స్పోర్టీగా కూడా ఉంటుంది. ఇక ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ల విషయానికి వస్తే.. కిగర్ స్క్రీన్ పెద్దగా ఉండనుంది. పంచ్‌లో ఈ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కాస్త చిన్నగా ఉండనుంది. ఈ రెండిటి ఇంటీరియర్ క్వాలిటీ చాలా బాగుంది. క్యాబిన్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ పెద్ద బూట్ కెపాసిటీలు అందించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. కిగర్‌లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ అందించగా, పంచ్‌లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, క్లైమెట్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, క్రూజ్ కంట్రోల్ వంటి బేసిక్ ఫీచర్లు ఈ రెండిట్లోనూ ఉన్నాయి. కిగర్‌లో యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.
3. ఇంజిన్లు
పంచ్‌లో 83 హెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్ ఉన్న 1.21 పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక కిగర్‌లో 1.0 పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. దీని హెచ్‌పీ 72 కాగా. 96 ఎన్ఎం టార్క్‌ను ఇది అందించనుంది. ఇందులో కూడా 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టర్బో పెట్రోల్ కిగర్‌లో 100 హెచ్‌పీ, 160 ఎన్ఎం టార్క్ ఉండనుందని తెలుస్తోంది. టర్బో పెట్రోల్‌లో 5-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోను అందించనున్నారు. ఈ రెండిట్లోనూ డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిట్లోనూ స్టాండర్డ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు మంచి పెర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. టర్బో పెట్రోల్ వేరియంట్‌లో ఎక్స్‌ట్రా పెర్ఫార్మెన్స్, స్మూత్ సీవీటీ అందుబాటులో ఉండనుంది. పంచ్‌లో ఈ ఆఫర్ లేదు కానీ ఏఎంటీ వేరియంట్లలో 1.21 పెట్రోల్, ఏఎంటీ ట్రాక్షన్ మోడ్ అందుబాటులో ఉండనుంది. తక్కువ ట్రాక్షన్ ఉన్న సందర్భాల్లో ఇది ఉపయోగపడనుంది.
4. ధరలు
టాటా పంచ్ ధర రూ.5.4 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హైఎండ్ వేరియంట్ ధర రూ.9.3 లక్షలుగాఉంది. ఇక కిగర్ ధర రూ.5.6 లక్షల నుంచి రూ.9.8 లక్షల వరకు ఉండనుంది. వీటిలో కేవలం బడ్జెట్ పరంగా చూసుకుంటే పంచ్ బెస్ట్ ఆప్షన్. దీని ధర తక్కువగా ఉండటంతో పాటు కొంచెం ఎక్కువ స్పేస్, ఆఫ్ ద రోడ్ సామర్థ్యం కూడా ఉంది. కిగర్ ధర కాస్త ఎక్కువ అయినా మంచి పెర్ఫార్మెన్స్, ఎక్కువ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీ బడ్జెట్, అవసరాలను బట్టి మీకు కావాల్సిన కారును మీరే ఎంచుకోండి!
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!