2025 Hyundai Venue కొత్త అవతారం ఇదే - డిజైన్, ఫీచర్లతో మెరుస్తున్న కంపాక్ట్ SUV కేవలం ₹25,000 కే!
కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న లాంచ్ కానుంది. కేవలం ₹25,000తో బుక్ చేసుకోవచ్చు. కొత్త డిజైన్, 12.3 అంగుళాల డ్యుయల్ స్క్రీన్స్, పెట్రోల్-డీజిల్ ఆప్షన్లతో మరింత ప్రీమియంగా వస్తోంది.

2025 Hyundai Venue Launch Date Interior: హ్యుందాయ్, తన అత్యంత పాపులర్ కంపాక్ట్ SUV అయిన వెన్యూ కొత్త తరం మోడల్‌ను అధికారికంగా రివీల్ చేసింది. నవంబర్ 4న లాంచ్ చేయబోతున్న ఈ కొత్త వెన్యూ కోసం బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి, కేవలం ₹25,000 అడ్వాన్స్‌తో ఈ కొత్త కారును బుక్ చేసుకోవచ్చు. డిజైనింగ్‌లోనూ, ఫీచర్లలోనూ ఈ వెర్షన్ పూర్తిగా కొత్త లుక్‌తో వచ్చింది.
కొత్త లుక్, కొత్త లెవల్ SUV స్టైల్
కొత్త వెన్యూ ముందు భాగం చాలా షార్ప్‌గా, SUV తరహాలో రూపొందించారు. ఫుల్-విడ్త్ LED లైట్‌బార్, క్వాడ్-బీమ్ హెడ్‌ల్యాంప్స్, భారీ గ్రిల్, మస్కులర్ బంపర్ డిజైన్ వంటివి చూసిన వెంటనే ఆకట్టుకుంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో... Tucson, Exter తరహాలో కటింగ్ లైన్స్, బ్లాక్‌డ్-అవుట్ C-పిల్లర్ వద్ద వెన్యూ ఇన్‌స్క్రిప్షన్, కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో కూడా LED లైట్‌బార్, బోల్డ్ ‘VENUE’ బ్యాడ్జింగ్, డ్యూయల్-టోన్ క్లాడింగ్ డిజైన్ కనిపిస్తుంది.
కొత్త వెన్యూ సైజ్‌లో కూడా పెద్దదే. దీని పొడవు 3995mm, వెడల్పు 1800mm, ఎత్తు 1665mmగా ఉండగా, పాత మోడల్‌తో పోలిస్తే కొంత ఎత్తు, వెడల్పు పెరిగింది. వీల్‌బేస్ 20mm పెరిగి 2520mm కి చేరింది.
ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్
క్యాబిన్‌లో 12.3 అంగుళాల డ్యూయల్ కర్వ్‌డ్ డిస్‌ప్లే సెటప్ ఈ మోడల్‌లో హైలైట్. సెంటర్ కన్సోల్‌లో వేర్వేరు బటన్‌లు, కంట్రోల్స్ సౌకర్యవంతంగా అమర్చారు. స్టీరింగ్‌పై హ్యుందాయ్ లోగో బదులు మోర్స్ కోడ్‌లో “H” అక్షరం చూపించే నాలుగు లైట్లు ఉన్నాయి, Ioniq 5 డిజైన్ స్పూర్తితో దీనిని తీసుకున్నారు.
డ్యాష్‌బోర్డ్ డ్యుయల్-టోన్ ఫినిష్‌లో ఉంటుంది (డార్క్ నేవీ, గ్రే కలర్స్). వెంటిలేటెడ్ సీట్స్, పార్కింగ్ కెమెరా, డ్రైవ్ మోడ్, ట్రాక్షన్ మోడ్ బటన్‌లు, అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ప్రీమియం ఫీలింగ్ ఇస్తాయి. రియర్ సీట్స్‌కి టు-స్టెప్ రీక్లైన్ ఫంక్షన్, సన్‌షేడ్స్, కొత్త టూ-టోన్ లెదరెట్ సీటింగ్ కూడా లభిస్తుంది.
ఇంజిన్ ఆప్షన్లు మారలేదు
మెకానికల్‌గా, వెన్యూ పాత మోడల్ ఇంజిన్లనే కొనసాగిస్తోంది, అవి - 1.2L నేచురల్ పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్. టర్బో వేరియంట్ 7-స్పీడ్ DCTతో వస్తుంది. డీజిల్ మోడల్‌లో ఈసారి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది.
వేరియంట్లు, ధర అంచనా
కొత్త వెన్యూ HX2 నుంచి HX10 వరకు ఏడు ట్రిమ్‌లలో రానుంది. ధరల ప్రకటన నవంబర్ 4న జరుగుతుంది. లాంచ్ తర్వాత ఇది Tata Nexon, Maruti Brezza, Kia Sonet, Mahindra XUV 3XO వంటి రైవల్స్‌తో పోటీ పడనుంది.
కొత్త వెన్యూను డిజైనింగ్, ఫీచర్లతో మాత్రమే కాదు, ప్రీమియం ఇంటీరియర్, టెక్నాలజీతో కూడా యువతను ఆకట్టుకునేలా హ్యుందాయ్ ప్లాన్ చేసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















