సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్?
మహీంద్రా XUV 3XO ZNG, టాటా నెక్సాన్ iCNG రియల్ వరల్డ్ మైలేజీ, పవర్, టార్క్ & ధరలను పోల్చి తెలుసుకోండి. ఏ CNG SUV కొనడం మంచిదో చూడండి.

Mahindra XUV 3XO vs Tata Nexon CNG Mileage: పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నవాళ్లకు CNG కార్లు మంచి ఆప్షన్. ఈ సెగ్మెంట్లో పాపులర్ అయిన కార్లలో మహీంద్రా XUV 3XO ZNG & టాటా నెక్సాన్ iCNG ఉన్నాయి. ఈ రెండు కాంపాక్ట్ SUVల్లో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు కంపెనీ అమర్చిన CNG కిట్ ఉంది. రెండింటిలోనూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, బూట్ ఫ్లోర్ కింద ట్విన్ సిలిండర్ CNG వ్యవస్థ ఉన్నాయి. అయితే, కంపెనీ ప్రకటించిన లెక్కల్లో కాకుండా నిజ జీవితంలో ఏ కారు ఎక్కువ మైలేజీ ఇస్తుంది? పవర్ విషయంలో ఏది ముందుంది? ధర పరంగా ఏది లాభదాయకం? వివరంగా తెలుసుకుందాం.
ఇంజిన్, పవర్ విషయంలో XUV 3XOదే పైచేయి
మహీంద్రా XUV 3XO ZNG, టాటా నెక్సాన్ iCNG రెండింటిలోనూ 1.2-లీటర్, మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇవి MPFI ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. అయితే CNG మోడ్‌లో ఇంజిన్ పనితీరు విషయంలో మహీంద్రా ముందుంది.
XUV 3XO ZNG ఇంజిన్ 111hp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ iCNGలో 100hp పవర్, 170Nm టార్క్ లభిస్తాయి. అంటే మహీంద్రాకు 11hp అధిక పవర్, 30Nm అధిక టార్క్ ఉన్నాయి.
XUV 3XOలో 1,197cc ఇంజిన్ ఉండగా, నెక్సాన్‌లో 1,199cc ఇంజిన్ ఉంది. మహీంద్రా ప్రకారం, దాని 10-bar CNG ఇంజెక్షన్ వ్యవస్థ వల్ల పెట్రోల్, CNG మోడ్‌లలోనూ ఒకే స్థాయి పవర్ & టార్క్ అందుతాయి. నెక్సాన్‌లో మాత్రం పెట్రోల్ నుంచి CNGకి మారినప్పుడు పవర్ తగ్గుతుంది.
XUV 3XO గరిష్ఠంగా 200Nm టార్క్‌ను 1,500-3,500rpm మధ్య అందిస్తుంది. నెక్సాన్ 170Nm టార్క్‌ను 2,000-3,000rpm మధ్య ఉత్పత్తి చేస్తుంది. దీంతో మహీంద్రా SUVలో టార్క్ అందుబాటులో ఉండే పరిధి కూడా విస్తృతంగా ఉంటుంది.
రెండు SUVల్లోనూ CNG సామర్థ్యం 60 లీటర్లు. అయితే పెట్రోల్ ట్యాంక్ విషయంలో నెక్సాన్ కొంచెం ముందుంది. XUV 3XOలో 42 లీటర్ల ట్యాంక్ ఉండగా, నెక్సాన్‌లో 44 లీటర్ల ట్యాంక్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఇండియాలో తయారీతో రూ.34 లక్షలు తగ్గిన డిఫెండర్ 110 రేటు.. నవంబర్ 15 నుంచి డెలివరీలు
రియల్ వరల్డ్ మైలేజీ.. సిటీలో మహీంద్రా, హైవేపై టాటా
ఎక్స్‌పర్ట్‌లు ఈ రెండు SUVల మైలేజీని వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో పరీక్షించారు. ఫలితాల్లో నగర ప్రయాణాల్లో XUV 3XO మెరుగ్గా నిలవగా, హైవే ప్రయాణాల్లో నెక్సాన్ ముందుంది.
మహీంద్రా XUV 3XO ZNG సిటీ ట్రాఫిక్‌లో 16.75 km/kg మైలేజీ ఇచ్చింది. టాటా నెక్సాన్ iCNG 15.10 km/kg అందించింది. అంటే నగరంలో మహీంద్రా SUVకి 1.65 km/kg ఆధిక్యం ఉంది.
హైవేపై మాత్రం మాత్రం ఫలితం మారింది. నెక్సాన్ iCNG 23.70 km/kg మైలేజీ నమోదు చేసింది. XUV 3XO ZNG 22.29 km/kg ఇచ్చింది. అంటే హైవే మీద టాటా SUVకి 1.41 km/kg ఆధిక్యం లభించింది.
సగటు మైలేజీని పరిశీలిస్తే, XUV 3XO ZNG 19.52 km/kg అందించింది. నెక్సాన్ iCNG 19.40 km/kg నమోదు చేసింది. ఈ రెండు వాహనాల మధ్య తేడా కేవలం 0.12 km/kg మాత్రమే. అయినప్పటికీ మొత్తం పరీక్షలో మహీంద్రా స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించింది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, XUV 3XOలో ఆటోమేటిక్ ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫీచర్ ఉంది. ఇది పెట్రోల్ & CNG రెండు మోడ్లలో పనిచేస్తుంది. నెక్సాన్ iCNGలో ఈ ఫీచర్ లేదు.
ఇది కూడా చదవండి: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
ధర విషయంలో ఏది చౌక?
ధరల పరంగా ఈ రెండు SUVల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మహీంద్రా XUV 3XO ZNG వేరియంట్ల ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.11.19 లక్షల వరకు ఉన్నాయి. టాటా నెక్సాన్ iCNG ధరలు రూ.8.35 లక్షల నుంచి రూ.13.42 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
ప్రారంభ వేరియంట్‌ను పోలిస్తే, XUV 3XO CNG ధర నెక్సాన్ CNG కంటే రూ.1.64 లక్షలు ఎక్కువ. అయితే టాప్ వేరియంట్ల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. అక్కడ XUV 3XO CNG ధర నెక్సాన్ CNG కంటే రూ.2.23 లక్షలు తక్కువగా ఉంది.
మైలేజ్ టెస్ట్ ఎలా నిర్వహించారు?
టెస్ట్ ప్రారంభానికి ముందు రెండు వాహనాల ఇంధన ట్యాంకులను పూర్తిగా నింపారు. తయారీ సంస్థ సూచించిన టైర్ ప్రెషర్‌ను పాటించారు. నవీ ముంబై పరిసరాల్లో నిర్ణీత నగర, హైవే మార్గాల్లో వాహనాలను నడిపారు. పరీక్ష సమయంలో AC, ఆడియో సిస్టమ్ వంటి సాధారణ విద్యుత్ పరికరాలను సాధారణ డ్రైవర్ల తరహాలోనే ఉపయోగించారు. డ్రైవింగ్ స్టైల్లో తేడాల ప్రభావం తగ్గించేందుకు డ్రైవర్లను కూడా మారుస్తూ పరీక్ష నిర్వహించారు. ప్రతి ప్రయాణ దశ ముగిసిన తర్వాత, ట్యాంకుల్లో ఖాళీని మళ్లీ పూర్తిగా నింపారు. ఇలా నింపడానికి ఎంత ఇంధనం అవసమైందో చూసి, దానిని బట్టి మైలేజీని లెక్కించారు.
ఏ CNG SUV కొనడం మంచిది?
నగరంలో ఎక్కువగా ప్రయాణిస్తూ, మెరుగైన మొత్తం మైలేజీతో పాటు అధిక పవర్ & టార్క్ కోరుకునేవారికి మహీంద్రా XUV 3XO ZNG మంచి ఎంపికగా నిలుస్తుంది. మొత్తం మైలేజీలోనూ స్వల్పంగా ముందుంది. హైవే ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి టాటా నెక్సాన్ iCNG ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రారంభ ధర కూడా తక్కువగా ఉండటంతో బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే వారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక.
గమనిక: ఇక్కడ పేర్కొన్న మైలేజీ గణాంకాలు.. రియల్ రోడ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితాలు. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్, వాహన నిర్వహణను బట్టి మీకు వచ్చే మైలేజీ మారవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















