Defender 110: ఇండియాలో తయారీతో రూ.34 లక్షలు తగ్గిన డిఫెండర్ 110 రేటు.. నవంబర్ 15 నుంచి డెలివరీలు
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110ను పుణెలో అసెంబుల్ చేయడంతో ధర రూ.34 లక్షల వరకు తగ్గింది. కొత్త ధరలు, ఇంజిన్ వివరాలు, అదనపు ఫీచర్లు & డెలివరీ తేదీ తెలుసుకోండి.

Land Rover Defender 110 Details In Telugu: లగ్జరీ SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే "ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110" గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఖరీదైన SUV ధరను కంపెనీ ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇండియాలోనే డిఫెండర్ 110 అసెంబ్లీని ప్రారంభించడంతో ఈ మార్పు వచ్చింది. గతంలో పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ SUVని ఇప్పుడు పుణెలో అసెంబుల్ చేస్తున్నారు. దీంతో కొన్ని వేరియంట్ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా 2-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.99 లక్షలకు చేరింది. అయితే, ఏ వేరియంట్ ఎంత తగ్గింది? కొత్తగా ఎలాంటి ఫీచర్లు అందిస్తున్నారు? తెలుసుకుందాం.
డిఫెండర్ 110 కొత్త ధరలు ఇవే
JLR పుణె ప్లాంట్‌లో Completely Knocked Down (CKD) కిట్లను ఉపయోగించి డిఫెండర్ 110ను అసెంబ్లీ చేస్తున్నారు. ఈ కిట్లు స్లోవేకియా నుంచి వస్తాయి. ప్రస్తుతం X-Dynamic HSE ట్రిమ్‌లోని మూడు ఇంజిన్ ఎంపికలకు ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది.
2-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర గతంలో రూ.1.13 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.99 లక్షలకు తగ్గింది. అంటే రూ.14 లక్షలు ఆదా అవుతుంది. 3-లీటర్ టర్బో పెట్రోల్, 3-లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు గతంలో రూ.1.52 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1.18 కోట్లకు చేరాయి. ఈ రెండు వేరియంట్లపై రూ.34 లక్షల తగ్గింపు లభిస్తోంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకటించిన సమాచారం ప్రకారం, డెలివరీలు నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇంజిన్, పవర్ వివరాలు
డిఫెండర్ 110 X-Dynamic HSE మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 300hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3-లీటర్ డీజిల్ ఇంజిన్ 350hp పవర్ అందిస్తుంది. 3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 400hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఎంపికను బట్టి ధర, పనితీరు మారుతాయి.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కొత్త Electric SUV, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ !
2-లీటర్ పెట్రోల్ వేరియంట్‌లో అదనపు ఫీచర్లు
భారత్‌లో అసెంబ్లీ చేసే 2-లీటర్ పెట్రోల్ డిఫెండర్ 110లో గతంలో అదనపు ధరకు లభించిన కొన్ని ఫీచర్లను ఇప్పుడు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటి విలువ రూ.6.50 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
అడాప్టివ్ ఆఫ్-రోడ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ డైనమిక్స్‌తో కూడిన ఎయిర్ సస్పెన్షన్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ వాషర్, స్పేర్ వీల్ లాక్, బాడీ రంగులో స్పేర్ వీల్ కవర్ కూడా అందిస్తున్నారు.
మూడో వరుస సీట్లను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. ముందు సెంటర్ కన్సోల్‌లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ముందు సీట్లకు 14-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు హీటింగ్, కూలింగ్ & మెమరీ ఫంక్షన్లు లభిస్తాయి. లగ్జరీతో పాటు ప్రయాణ సౌకర్యాన్ని కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.
3-లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఏమున్నాయి?
ఈ రెండు ఇంజిన్ ఎంపికలతో వచ్చే X-Dynamic HSE వేరియంట్లలోనూ అదనపు ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటి విలువ రూ.17 లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
20-అంగుళాల వీల్స్, ఇల్యూమినేటెడ్ మెటల్ ట్రెడ్‌ప్లేట్లు, టార్క్ వెక్టరింగ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండో వరుస సీట్లను ముందుకు వెనక్కి జరపడం, వాల్చడం కోసం మాన్యువల్ సర్దుబాట్లు ఇచ్చారు. నాలుగు దిశల్లో సర్దుబాటు చేసుకునే వింగ్‌డ్ హెడ్‌రెస్టులు, హీటెడ్ థర్డ్-రో సీట్లు కూడా ఉన్నాయి.
ఇవే కాకుండా స్వెడ్ హెడ్‌లైనర్, వెనుక ప్రయాణికులకు కూలింగ్ సదుపాయంతో కూడిన త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, Meridian సరౌండ్ సౌండ్ సిస్టమ్ & హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు లభిస్తాయి.
అన్ని డిఫెండర్ మోడళ్ల ధరలు తగ్గాయా?
లేదు. ప్రస్తుతం ఈ ధర తగ్గింపు డిఫెండర్ 110లోని X-Dynamic HSE వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. Defender Octa, 5-లీటర్ V8 మోడళ్లు, Defender 90 & Defender 130 బాడీ స్టైళ్లను కంపెనీ ఇంకా దిగుమతి చేసుకుంటోంది.
ఇప్పటికే Range Rover, Range Rover Sport, Velar, Evoque & Discovery Sport మోడళ్లను కూడా భారత్‌లో అసెంబుల్ చేస్తున్నారు.
JLR ఇండియాకు డిఫెండర్ కీలకమైన మోడల్‌గా నిలిచింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, FY2026లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన JLR మోడల్ డిఫెండర్. ఇప్పటివరకు దేశంలో 9,000కు పైగా డిఫెండర్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















