New GST Rates Cars: కియా కార్లపై రూ.4.5 లక్షలకు పైగా ఆదా.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. పలు మోడళ్ల ధరలు కూడా భారీగా తగ్గింపు
ఈనెల మొదటి వారంలోనే మోటార్ వెహికల్ కస్టమర్లకు పండుగ సీజన్ ప్రారంభమైందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. జీఎస్టీలో విప్లవాత్మక మార్పులు తేవడంతో కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

Kia India announced the new prices of its ICE Cars News: కేంద్ర ప్రభుత్వం సరళీకరించిన జీఎస్టీ 2.0 లాభాన్ని వినియోగదారులకు అందించడానికి మోటార్ వెహికిల్ ఇండస్ట్రీ కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే అనేక బైక్, కారు కంపెనీలు జీఎస్టీ వ్యత్యాసాన్ని వినియోగదారులకు బదిలీ చేయడానికి సుముఖంగా ఉండగా, తాజాగా ఈ జాబితాలోకి కియా మోటార్స్ కూడా చేరింది. కియా ఇండియా ఇటీవల జీఎస్టీ 2.0 ప్రకటన అనంతరం, తన మొత్తం ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) పోర్ట్‌ఫోలియోపై వినియోగదారులకు తాజా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా అందించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 3, 2025న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ జీఎస్టీ 2.0 నిర్ణయం తీసుకోబడిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రెండు జీఎస్టీ స్లాబులు 12, 28 శాతాలను తీసివేసి, 40 శాతం కొత్త స్లాబును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తక్కువ స్లాబు పరిధిలోకి చాలా మోటార్ వాహనాలు రానుండటంతో ఈమేరకు కంపెనీలకు అమ్మకాలు పెరగనున్నాయి. ఈ ప్రయోజనాలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
సంస్కరణలకు నిదర్శనం..
జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సందర్భంగా కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ గ్వాంగ్ లీ మాట్లాడుతూ, ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు తీసుకురావడం ప్రభుత్వ ప్రజా ఉపయోగ, దూరదృష్టి కలిగిన సంస్కరణలకు నిదర్శనమని కొనియాడారు. ఇది వినియోగదారుల కోసం వాహనాల కొనుగోలును మరింత అందుబాటులోకి తేవడమే కాకుండా ఆటోమొబైల్ రంగానికి గణనీయమైన ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశగా, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని తాము కస్టమర్లకు పూర్తిగా అందజేయడం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్కరణ పన్నుల విధానాన్ని సరళతరం చేయడమే కాకుండా స్థిరమైన ఆర్థిక వృద్ధికి, నవీన ప్రయాణ మార్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలుపుతుందని కొనియాడారు.
రాబోయే పండుగ కాలంలో ఈ మార్పు వినియోగదారుల ఉత్సాహాన్ని పెంచి, డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని తాము నమ్ముతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారీగా తగ్గింపు..
జీఎస్టీ తగ్గింపు వల్ల కియా ఇండియా ICE మోడళ్లలో చాలా వాటి ధరలు తగ్గునుండటంతో కార్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన జీఎస్టీ ప్రకారం మోడళ్ల వారీగా ధర తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి. సోనెట్ .. రూ.1,64,471 వరకు, సైరాస్ .. రూ 1,86,003 వరకు, సెల్టోస్ .. రూ 75,372 వరకు, కరెన్స్ .. రూ 48,513 వరకు, కరెన్స్ క్లావిస్ .. రూ. 78,674 వరకు, కార్నివల్ రూ..4,48,542 వరకు ధర తగ్గనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. మిగతా కంపెనీల మాదిరిగానే కియా కూడా కస్టమర్లకు తగ్గింపు ప్రయోజనాన్ని అందించడంపై విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





















