Electric Bike Maintenance: ఎలక్ట్రిక్ వాహనాల మెంట్‌నెన్స్ చిట్కాలు - సాధారణ బైక్‌లకన్నా ఏంటి తేడా?
Electric Scooter Maintenance Tips: ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్‌ను మెరుగ్గా, కొత్తదానిలా నిర్వహించాలంటే ఏం చేయాలి?. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే వీటి నిర్వహణలో ఉన్న తేడాలు ఏంటి? చిట్కాలు ఈ కథనంలో.

Electric Bike/Scooter Service Guide: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది, ఇదొక యూత్‌ఫుల్ ట్రెండ్‌లా మారింది. ఆఫీస్‌లకు వెళ్లే ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను బాగానే వాడుతున్నారు. ముఖ్యంగా, బరువు తక్కువగా ఉండడం, పెట్రోల్ బంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల మహిళలకు ఈ బండ్లు చాలా అనువుగా మారాయి. బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్వహణలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణ పెట్రోల్ బైక్ నిర్వహణ కంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడినప్పటికీ, కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాల్సి ఉంటుంది.
EV యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెయింటెనెన్స్ చిట్కాలు:
1. బ్యాటరీ సంరక్షణ గుండె లాగా కీలకం
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిచేదే బ్యాటరీ వల్ల. ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీని ఎప్పుడూ 100% వరకు ఛార్జ్ చేయకూడదు, అదే విధంగా, ఛార్జింగ్ ఎప్పుడూ 20% కంటే తగ్గనీయ కూడదు. ఎప్పుడు చూసినా, బ్యాటరీ స్థాయి 20%–80% మధ్యలో ఉండేలా జాగ్రత్త పడాలి. అదేవిధంగా, EVని దీర్ఘకాలం పాటు వాడకపోతే, ప్రతి 5-10 రోజులకు ఒకసారి ఛార్జ్ చేయడం మంచిది.
2. ఛార్జింగ్ చేసే పద్ధతిలో జాగ్రత్తలు
అధికంగా వేడెక్కే చోట లేదా తడిగా ఉండే ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టకూడదు. కంపెనీ ఇచ్చే ఒరిజినల్ ఛార్జర్‌నే వాడాలి, తక్కువ ధరకు వస్తుంది కదాని ఇతర ఛార్జర్లను కొనవద్దు, దీనివల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోతుంది, పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. పవర్ ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్టెబిలైజర్ ఉపయోగించడం ఉత్తమం.
3. టైర్ ప్రెషర్ & బ్రేక్ చెక్ చేయడం మర్చిపోకండి
పెట్రోల్ బైక్‌లా కాకుండా, ఈవీ బైక్‌లు అత్యంత తక్కువ శబ్దంతో (దాదాపుగా శబ్దం చేయకుండా) నడుస్తాయి, కాబట్టి చిన్నపాటి బ్రేక్ సమస్యలను కూడా ముందే గుర్తించాలి. EV టైర్ ప్రెషర్ తగ్గితే మైలేజ్ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ టైర్లలో గాలి ఒత్తిడిని ప్రతి వారం చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి.
4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు తప్పనిసరి
కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో OTA (Over The Air) అప్‌డేట్లు వస్తుంటాయి. వాటిని ఇగ్నోర్ చేయకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా బగ్స్ (సమస్యలు) తగ్గుతాయి, బండి పెర్ఫార్మెన్స్ కూడా మెరుగవుతుంది.
5. శుభ్రతపై శ్రద్ధ
ఎలక్ట్రిక్ వాహనాన్ని నేరుగా నీటితో కడగడం చేయొద్దు. బదులుగా, తడి వస్త్రంతో మృదువుగా తుడవడం అలవాటు చేసుకోండి. ఎలక్ట్రానిక్ భాగాల్లో తేమ చేరకుండా జాగ్రత్త పడాలి. వాహనాన్ని ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేయవద్దు, ఎప్పుడూ నీడలోనే నిలిపే ప్రయత్నం చేయండి. దీనివల్ల బ్యాటరీ హీట్ తగ్గుతుంది.
6. తరచుగా రైడ్ చేయడం వల్లే జీవితం
ఎలక్ట్రిక్ బైక్‌లను ఎక్కువ రోజుల పాటు నడపకుండా పక్కనపెడితే మీకే నష్టం, దీనివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. బండిని తీయాల్సిన అవసరం లేకున్నా, వారానికి కనీసం 2-3 సార్లు కొంతదూరం వరకైనా తప్పనిసరిగా వెళ్లిరావాలి. దీనివల్ల వాహన పనితీరు మెరుగ్గా ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ నిర్వహణతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే పరిష్కారాలు. అయితే, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే బ్యాటరీ నష్టాలు, పనితీరు సమస్యలు ఎదురవుతాయి. పై చిట్కాలను పాటిస్తే మీరు మీ ఈవీ బైక్‌ను సంవత్సరాల తరబడి మిన్నగా నడిపించవచ్చు. మైలేజ్‌తో పాటు మైండ్ పీస్ కూడా మీ సొంతం అవుతుంది!



















