420cc ఇంజిన్, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
BMW F 450 RR బైక్‌లో 420cc ఇంజిన్, 48hp పవర్, 6.5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నాయి. వేరియంట్లు, ఫీచర్లు, ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకోండి.

BMW F 450 RR Details In Telugu: ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలో BMW Motorrad నుంచి వస్తున్న కొత్త మోడల్ BMW F 450 RR. ఇది పూర్తిగా ఫెయిరింగ్‌తో కూడిన స్పోర్ట్స్ బైక్. కంపెనీ 420cc ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన మూడో మోటార్‌సైకిల్ ఇది. ఇప్పటికే ఇదే ప్లాట్‌ఫామ్‌పై BMW F 450 GS, F 450 R మోడళ్లు వచ్చాయి. ఈ మూడు బైక్‌లను TVSకు చెందిన హోసూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. F 450 RR ఇంజిన్, ఫీచర్లు, వేరియంట్లు, భారత్‌లో లాంచ్ గురించి తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే.
1. 420cc ఇంజిన్.. 48hp పవర్
BMW F 450 RRలో 420cc, లిక్విడ్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,750rpm వద్ద 48hp గరిష్ఠ పవర్, 6,750rpm వద్ద 43Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ను BMW F 450 GS, F 450 R మోడళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ మూడు మోటార్‌సైకిళ్లలో గరిష్ఠ పవర్, టార్క్ గణాంకాలు ఒకేలా ఉన్నాయి.
అయితే, F 450 RR ప్రత్యేకంగా స్పోర్టీ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫెయిర్డ్ మోడల్. ఇందులో సింగిల్ ప్లేన్ వింగ్‌లెట్స్ కూడా ఉన్నాయి.
2. సీటు ఎత్తు 790mm.. బరువు 177kg
ఈ బైక్ సీటు ఎత్తు 790mm. రైడర్ అవసరాన్ని బట్టి అదనపు యాక్సెసరీ సీట్ల ద్వారా ఎత్తును మార్చుకునే అవకాశం ఉంది. ఆప్షనల్ సీట్లతో సీటు ఎత్తును 810mmకు పెంచుకోవచ్చు లేదా 775mmకు తగ్గించుకోవచ్చు.
బేస్ వేరియంట్ కెర్బ్ వెయిట్ 177kgగా ఉంది. బైక్‌ను ఎంచుకునేటప్పుడు రైడర్ ఎత్తు, సీటుపై కూర్చునే సౌకర్యం, ట్రాఫిక్‌లో నడిపే విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
3. 6.5 అంగుళాల TFT డిస్‌ప్లే.. అధునాతన భద్రతా ఫీచర్లు
BMW F 450 RRలోని 4 వేరియంట్లలోనూ 6.5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా అందించారు. Rain, Road, Race అనే మూడు రైడింగ్ మోడ్స్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయి.
ఎలక్ట్రానిక్ ఫీచర్లలో కార్నరింగ్‌కు అనుగుణంగా పని చేసే డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఉన్నాయి. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, హీటెడ్ గ్రిప్స్, సర్దుబాటు చేసుకునే బ్రేక్, క్లచ్ లీవర్లు, Type-C USB పోర్ట్ కూడా లభిస్తాయి.
సస్పెన్షన్ విషయానికి వస్తే, అన్ని వేరియంట్లలో KYB 43mm USD ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. ముందు భాగంలో 310mm డిస్క్‌తో Brembo నాలుగు పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్, వెనుక భాగంలో 240mm డిస్క్‌తో Bybre సింగిల్ పిస్టన్ కాలిపర్ అమర్చారు.
4. నాలుగు వేరియంట్లు.. ఏది ప్రత్యేకం?
BMW F 450 RRను Base, Sport, M Sport, M Sport with Innovation Package అనే నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. మొత్తం మూడు రంగుల ఎంపికలు ఉన్నాయి.
బేస్ వేరియంట్‌లో వెనుక మోనోషాక్‌కు ప్రీలోడ్, రీబౌండ్ సర్దుబాటు సౌకర్యం ఉంటుంది. అయితే, ముందు USD ఫోర్క్‌ను సర్దుబాటు చేయలేం.
Sport వేరియంట్‌లో రెండు దిశల్లో పనిచేసే క్విక్‌షిఫ్టర్, స్పోర్ట్ సస్పెన్షన్ లభిస్తాయి. ఇందులో ముందు ఫోర్క్‌కు కంప్రెషన్, రీబౌండ్ సర్దుబాట్లు చేసుకోవచ్చు.
M Sport వేరియంట్‌లో Race Pro అనే నాలుగో రైడింగ్ మోడ్ అదనంగా ఉంటుంది. ఇందులో ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వ్యవస్థలను రైడర్ తన అవసరానికి అనుగుణంగా విడివిడిగా సర్దుబాటు చేసుకోవచ్చు.
హైయ్యర్ M Sport with Innovation Package వేరియంట్‌లో ఈజీ రైడ్ క్లచ్ (ERC) సిస్టమ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: KTM 200 Duke కొత్త ఫీచర్లు లీక్.. 25hp పవర్‌తో మరింత స్పోర్టీ రైడింగ్, ధర స్వల్పంగా పెరిగే అవకాశం!
5. భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
BMW Motorrad, F 450 RR ని భారత మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ధరల వివరాలను కూడా వెల్లడించలేదు. నాలుగు వేరియంట్లలో ఎన్ని మోడళ్లను భారత్‌కు తీసుకొస్తారనే విషయంపైనా స్పష్టత లేదు.
అయితే, F 450 GS మోడల్ గ్లోబల్ మార్కెట్‌లో పరిచయమైన సుమారు ఆరు నెలల తర్వాత భారత్‌లో లాంచ్ అయింది. కంపెనీ ఇదే విధమైన కాలక్రమాన్ని అనుసరిస్తే.. F 450 R, F 450 RR మోడళ్లను 2027 తొలి త్రైమాసికంలో, అంటే జనవరి నుంచి మార్చి మధ్యలో భారత్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఇది అధికారిక లాంచ్ తేదీ కాదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















