Bengaluru: చారాణా కోడికి బారాణా మసాలా! రూ. 11 లక్షలు పెట్టికొన్న కారుకు రూ. 22 లక్షల రిపేర్ బిల్లు
బెంగళూరులో విచిత్ర ఘటన జరిగింది. రిపేరు కోసం వచ్చిన కారుకు కంపెనీ సర్వీస్ సెంటర్ ఇచ్చిన బిల్లు చూసి యజమాని షాక్ అయ్యాడు. కారు కొన్నదాని కంటే రిపేరు ఖర్చు రెట్టింపు ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
బెంగళూరులో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. నగరాన్ని అతలాకుతలం చేశాయి. రవాణా, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విమాన, రైలు ప్రయాణాలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వరదల ధాటికి వేల సంఖ్యలో వాహనాలు చెడిపోయాయి. ఇంజిన్లలోకి నీళ్లు, బురద చేరి రిపేరు సెంట్లరకు వెళ్లాయి. తాజాగా ఓ కారు యజమాని రిపేరు కోసం సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు. తీరా రిపేర్ అయ్యాక ఇచ్చిన బిల్లును చూసి షాక్ అయ్యాడు. కొత్త కారు కొంటే అయిన ధర కంటే రిపేరుకు అయిన ఖర్చు డబల్ ఉండటంతో ఆశ్చర్యపోయాడు.
అనిరుధ్ గణేష్.. అనే వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అతడికి వోక్స్ వ్యాగన్ పోలో హ్యాచ్ బ్యాక్ కారు ఉంది. తాజాగా వచ్చిన వరదలకు ఆయన కారు పూర్తిగా చెడిపోయింది. నీళ్లలో మునగడంతో ఇంజిన్ సహా బాడీలోనూ చాలా భాగాలు పాడయ్యాయి. దాన్ని రిపేరు చేయించాలని భావించి.. వైట్ ఫీల్డ్ లోని వోక్స్ వ్యాగన్ ఆపిల్ ఆటో సర్వస్ సెంటర్ కు పంపించాడు. అక్కడ ఆయన కారును పరిశీలించిన సర్వీస్ సెంటర్ సిబ్బంది.. రిపేరుకు ఏకంగా రూ. 22 లక్షలు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆ అంచనా వ్యయాన్ని చూసి అనిరుధ్ షాక్ అయ్యాడు. కారు రూ. 11 లక్షలు పెట్టి కొనుగోలే చేస్తే.. రిపేరు ఖర్చు రూ. 22 లక్షలు అవుతుందా? అని ఆశ్చర్యపోయాడు.
అంతేకాదు, అతడి కారు పూర్తి స్థాయిలో చెడిపోయినందున.. పూర్తిగా ఇన్స్యూరెన్స్ క్లయిమ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అయితే, సర్వీస్ సెంటర్ నుంచి కారును తీసుకెళ్లడానికి రూ.రూ.44,840 చెల్లించాలని కంపెనీ వెల్లడించింది. కారుకు జరిగిన నష్టానికి సంబంధించిన పత్రాలను జారీ చేయడానికి ఈ ఫీజు అవసరం అవుతుందని చెప్పింది. అందుకు అనిరుధ్ అంగీకరించలేదు. ప్రస్తుతం రూ. “6 లక్షలు విలువ చేసే కారు ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్స్ రెడీ చేయడానికి రూ. 44,840 రూపాయలు ఖర్చవుతుందా? వావ్” అంటూ అనురుధ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అటు "నేను వోక్స్‌వ్యాగన్ ఇండియాకు కాల్ చేశాను. ఆ తర్వాత మెయిల్ కూడా చేశాను. 48 గంటల్లో రిప్లై వస్తుందని చెప్పారు. కానీ, ఎలాంటి స్పందని రాలేదు. నేను నా కారు, ఇన్స్యూరెన్స్ డబ్బును పొందేందుకు సహకరించాలని కోరతున్నాను. ఈ కంపెనీ రాబందులకు తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నాను” అని అనిరుధ్ చెప్పాడు.
వోక్స్‌వ్యాగన్‌పై తీవ్ర విమర్శలు
అటు సోషల్ మీడియా వేదికగా వోక్స్ వ్యాగన్ కంపెనీపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ వ్యాపారం కోసం కస్టమర్లను ఇలా దోపిడీ చేయాలని చూస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాని నిర్ణయం. కస్టమర్ సెంట్రిక్ విధానం అని చెప్పే కంపెనీ ఇలాంటి మోసం చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో కంపెనీ.. అనిరుధ్ బిల్లును రూ.44,840 నుంచి రూ.5,000కి తగ్గించింది.
Also Read: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?
Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?