రికార్డులు, రివైవల్స్, షాకులు: 2025లో ద్విచక్ర వాహన రంగంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి?
2025లో టూ వీలర్ ఇండస్ట్రీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డులు, నార్టన్ రీ ఎంట్రీ, KTM కొనుగోలు, GST పెంపు, ఓలా పతనం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Two Wheeler Industry 2025: 2025 సంవత్సరం భారత ద్విచక్ర వాహన పరిశ్రమకు మరిచిపోలేని ఏడాదిగా నిలిచింది. అమ్మకాల రికార్డులు, బ్రాండ్‌ల పునరాగమనాలు, భారీ కొనుగోళ్లు, పన్ను మార్పులు - ఇవన్నీ కలిసి టూ వీలర్ ఇండస్ట్రీ ప్రయాణాన్ని ఎన్నో మైలురాళ్లు దాటించాయి. సాధారణ వినియోగదారుడి నుంచి బైక్ ప్రేమికుడి వరకు అందరిపైనా ఈ పరిణామాల ప్రభావం పడింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రాత్మక మైలురాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలిసారి 10 లక్షల వార్షిక అమ్మకాల మైలురాయిని దాటింది. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 10.9 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 11 శాతం వృద్ధి. ఎగుమతులు కూడా 1,07,143 యూనిట్లతో ఆల్‌టైమ్ హైకి చేరాయి. భారత మార్కెట్‌లో మాత్రమే కాకుండా గ్లోబల్‌గా కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ స్థానం మరింత బలపడిందని ఇది స్పష్టం చేసింది.
నార్టన్ మోటార్‌సైకిళ్ల రీ ఎంట్రీ
2020లో TVS కొనుగోలు చేసిన నార్టన్ మోటార్‌సైకిళ్లు 2025లో మళ్లీ జీవం పోసుకున్నాయి. యూరప్, అమెరికా, ఆసియా, ఇండియా సహా పలు మార్కెట్లలో కొత్త బైక్‌ల శ్రేణిని విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమైంది. మన దేశం ఈ బ్రాండ్‌కు కీలక మార్కెట్‌గా మారనుంది. మాంక్స్, మాంక్స్ R, అట్లాస్, అట్లాస్ GT మోడళ్లను ఇప్పటికే ఆవిష్కరించారు. 450cc సింగిల్ సిలిండర్ ప్లాట్‌ఫామ్‌ను 2026లో ప్రదర్శించే అవకాశం ఉంది.
350cc పైగా బైక్‌లపై GST పెంపు
సెప్టెంబర్ 22, 2025 నుంచి 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై GSTని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఇది ప్రీమియం బైక్ సెగ్మెంట్‌పై గణనీయమైన ప్రభావం చూపించింది. ధరలు పెరగడంతో కొంతమంది వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో, 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గాయి.
KTMను పూర్తిగా సొంతం చేసుకున్న బజాజ్
KTMను బజాజ్ ఆటో పూర్తిగా కొనుగోలు చేయడం.. 2025లో గ్లోబల్ మోటార్‌సైక్లింగ్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఘటనల్లో ఒకటి. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈ ఆస్ట్రియన్ బ్రాండ్‌ను బజాజ్ 800 మిలియన్ యూరోల పెట్టుబడితో సొంతం చేసుకుంది. మొదటగా యూరప్‌లో ఉత్పత్తిని స్థిరీకరించడం, కార్యకలాపాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టింది. భవిష్యత్‌లో KTM ఆపరేషన్‌లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ పతనం
ఒకప్పుడు నెలవారీ అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్, 2025లో క్రమంగా ఐదో స్థానానికి పడిపోయింది. TVS, బజాజ్, ఏథర్, విడా వంటి బ్రాండ్లు ముందంజలో నిలిచాయి. వినియోగదారుల ఫిర్యాదులు, సేవలపై అసంతృప్తి ఓలా పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. హైపర్‌సర్వీస్ క్యాంపెయిన్, రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్లు, 4680 భారత్ సెల్ వంటి చర్యలతో తిరిగి పుంజుకునేందుకు ఈ కంపెనీ ప్రయత్నం చేస్తోంది. 2026 సంవత్సరం ఓలాకు అత్యంత కీలకంగా మారనుంది.
మొత్తంగా చూస్తే, 2025 సంవత్సరం టూ వీలర్ ఇండస్ట్రీలో శక్తిమంతమైన బ్రాండ్‌ల ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. అదే సమయంలో విధాన మార్పులు, మార్కెట్ పోటీ, వినియోగదారుల అంచనాలు ఎంత వేగంగా కంపెనీల భవిష్యత్తును మార్చగలవో కూడా ఈ ఏడాది చూపించింది. వచ్చే సంవత్సరాల్లో ఈ పరిణామాల ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపించనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















