YS Jagan on Amaravti: మూడు రాజధానులకు మంగళం.. అమరావతిపై జగన్ దిగొచ్చారా.?
వైఎస్ జగన్ సంకటంలో పడ్డారు. ఓవైపు అమరావతిని ఒప్పుకోక తప్పని పరిస్థితి.. ఇంకోవైపు తన కలల ప్రాజెక్టు మూడు రాజధానులను పక్కన పెట్టాల్సిన దుస్థితి.. ! వైకాపా అధినేత సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో సూక్ష్మమిదే..!

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులన్న వైసీపీ నినాదం ఇక మూలన పడ్డట్లే..! అమరావతికి నేరుగా మద్దతు చెప్పలేదు కానీ.. దాని దగ్గరలో రాజధాని కట్టుకోమని చెప్పారు.. వైసీపీ నేత అధినేత జగన్.. ఇవాల్టి ప్రెస్‌మీట్‌లో పరోక్షంగా చెప్పింది అదే…
మూడు రాజధానుల నినాదాన్ని మోతమోగించి.. మూడుచోట్లా బొక్కా బొర్లా పడింది వైసీపీ. అది ఎంత దెబ్బతీసిందో ఎలక్షన్ తర్వాతనే అర్థం అయింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రాజధానిని నాశనం చేసి.. మూడు ముక్కలాట ఆడారన్న భావన ప్రజల్లో తీవ్రంగా వ్యాపించింది. వైఎస్సార్సీపీ మూడు రాజధానుల నినాదంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల తర్వాత దానిపై పెద్దగా స్పందించని ఆ పార్టీ ఇవాళ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. మూడు రాజధానులు మా అజెండాలో లేదన్నట్లుగా ఆ పార్టీ అధినేత జగన్ మోహనరెడ్డే స్వయంగా మాట్లాడారు. ఆయన నేరుగా ఆ విషయం చెప్పకపోయినా .. రాజధాని విషయంలో వైకాపా అధినేత మాటల మర్మం అదే అని అర్థం అవుతోంది. ఇవాళ పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టిన జగన్‌మోహనరెడ్డి రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలన్న తమ పార్టీ విధానానికి విరుద్ధంగా ఓ చోట 500 ఎకరాల్లో రాజధాని కట్టుకోమన్నారు.
బెజవాడ- గుంటూరు మధ్య రాజధాని
వైఎస్ జగన్మోహనరెడ్డి చాలా విషయాలపై ఇవాళ మాట్లాడారు కానీ.. ఎక్కువ మంది దృష్టి పెట్టని ఓ సంగతుంది. చాలా పెద్ద విషయాన్ని చాలా చిన్నగా చెప్పేశారు ఆయన...! అమరావతి బాబు బినామీల సొంతం... 50వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలో కుప్ప పోస్తున్నారు. ఇప్పటి వరకూ కట్టిన భవనాలన్నీ నాశనం.. అంటూ చాలా విషయాలే చెప్పారు జగన్ మోహనరెడ్డి. అదే మాటల ప్రవాహంలో రాజధానిని విజయవాడ- గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఓ 500ఎకరాల్లో కట్టుకోవాలని చెప్పారు. “విజయవాడ- గుంటూరు మధ్య ఓ 500 ఎకరాల్లో నీకు ఇష్టం వచ్చింది కట్టుకో..” అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అసలు అమరావతిలో కట్టడానికి.. నాగార్జున వర్సిటీ దగ్గర పెట్టడానికి తేడా ఏంటన్న సంగతి పక్కన పెడితే....మూడు రాజధానుల ముచ్చట ఏమైందన్న ప్రశ్న వస్తుంది.
మూడు రాజధానులు మూలన పడేసినట్లేనా..
2014-2019 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున... గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా గుర్తించి.. అదంతా అమరావతి అని ప్రకటించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. దానిని సమర్థించుకోవడానికి మూడు రాజధానులు అనే నినాదం తెచ్చింది. అమరావతిలో అసెంబ్లీ.. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. కర్నూల్‌కు న్యాయరాజధాని అంటూ ప్రచారం చేసుకొచ్చింది. మూడు రాజధానులు ఎందుకు అన్నవారిపై వైసీపీ విరుచుకుపడింది.
పేరుకు మూడు రాజధానులైనా.. విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించడానికి.. అమరావతిని పూర్తిగా చంపేయడానికి వేసిన ఎత్తుగడగా అందరికీ అర్థం అయింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ కూడా వైజాగ్ మాత్రమే రాజధాని అన్నట్లుగా టోన్ మార్చేసింది. అందుకోసం అప్పటి ప్రభుత్వం.. తమకు మండలిలో మద్దతు రాలేదని ఏకంగా మండలినే రద్దు చేసింది. హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లో మూడు రాజధానులపై సుదీర్ఘ పోరాటం చేసింది. ఏం చేసినా ప్రాక్టికల్‌గా మూడు రాజధానులు సాధ్యం కాలేదు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అదొక ముఖ్యమైన ఎన్నికల అంశం కూడా..! వైఎస్సార్సీపీ అన్ని ప్రాంతాల్లో దారుణంగా పరాభవం చెందడంతో మూడు రాజధానులు మూలకెళ్లినట్లేనా అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి.
అయితే ఈ విషయంపై ఎవరూ నోరు విప్పలేదు. జగన్ మోహనరెడ్డిని కాదని.. ఆ పార్టీలో వ్యాఖ్యలు చేసే పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామా లేదా అన్న విషయంలో పార్టీ నేతలు ఎవరికీ క్లారిటీ లేదు. అమరావతిపై ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం అని చెప్పారు కాబట్టి అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చిందని నిర్ణయించుకున్నారు ఏమో కూడా బయటకు చెప్పలేదు. కానీ ఇవాళ అమరావతిపై వ్యాఖ్యలు చేసిన జగన్ మోహనరెడ్డి గుంటూరు- బెజవాడ మధ్యలో రాజధాని కట్టుకోమన్నారు. అంటే విజయవాడ ప్రాంతాన్ని ఆయన అంగీకరించినట్లే. నేరుగా అమరావతిని యాక్సెప్ట్ చేయకపోయినా.. అమరావతి సమీపంలో రాజధాని ఓకే అన్నారు.
అమరావతిపై అదే ద్వేషం.. నాగార్జున వర్సిటీకి.. అమరావతికి తేడా ఏంటి..?
రాజధాని అమరావతిపై వైకాపా అధినేతకు ఉన్న వ్యతిరేకత ఇవాళ కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. అమరావతిలో పనులు, అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు ఆయన. ఇప్పటికే కట్టిన బిల్డింగులు ఉన్నా.. బాబు తన బినామీల కోసమే.. అమరావతిని అప్పులు తెచ్చి మరీ పెంచుతున్నారని.. చెప్పారు. ఎన్నికల తీర్పుతో ఇప్పుడు అమరావతిని కాదని చెప్పలేని పరిస్థితి ఆయనది. అలాగని ఒప్పుకోవడానికి కూడా అహం అడ్డొస్తోంది. అందుకని అమరావతిలో ఇప్పుడున్న చోట కాదని మళ్లీ ఇంకోచోట పెట్టుకోమని చెబుతున్నారు. అదే తీరుతో అప్పటికే లే అవుట్.. వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచిన అమరావతిని ఆపేశారు. ( జగన్ మోహనరెడ్డి చెప్పిన లెక్కల ప్రకారమే 41వేల కోట్లకు టెండర్లు) ఇప్పుడు పనులు చేసిన తర్వాత మళ్లీ నాగార్జున వర్సిటీ దగ్గర పెట్టుకోమంటున్నారు. మరి ఇప్పటి వరకూ చేసింది ఏమైపోవాలి. ఇలా చేయడం వల్లే కదా.. అమరావతికి అంచనాలు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు కొత్తగా మళ్లీ ఇంకోచోట పెట్టుకోవడం అంటే మళ్లీ ఖర్చే కదా.. అసలు ఆ విషయాన్ని వదిలేస్తే.. నాగార్జున యూనివర్సిటీకి.. ఇప్పటి రాజధానికి... మధ్య దూరం 15 కిలోమీటర్లు కూడా లేదు. ఆ మాత్రం దానికి మార్చడం ఎందుకు..?
అమరావతిని నిర్వీర్యం చేసిన వైఎస్సార్సీపీ
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా వ్యతిరేకించింది. దాదాపు 7-8వేల కోట్ల రూపాయల పనులు జరిగిన తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. అమరావతి పనులున్నీ అర్థాంతరంగా అపడంతో పాటు.. రాజధానిపై నెగటివ్ ప్రచారం కూడా చేశారు. ముందుగా ఆ ప్రభుత్వంలో మంత్రి అమరావతిని స్మశానం అన్నారు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరుగా వ్యతిరేకించారు. అసలు అమరావతే వద్దంటూ అక్కడ దీక్షలు చేయించారు. అమరావతి రైతుల దీక్షను అణచివేశారు. మూడు రాజధానులతో మేలు చేస్తాం అని చెప్పారు. కానీ ఈ పనిలో వైఎస్సార్సీపీ సక్సెస్ కాలేకపోయింది. మూడు రాజధానులపై జనాల్లో సానుకూలత రాలేదు. వైజాగ్ లో రాజధాని పెడతామని చెప్పినా కూడా అక్కడ వారు ఎన్నికలకు ముందు పెద్దగా పాజిటివ్‌గా రియాక్ట్ కాలేదు. అయినా సరే ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం మొండిగానే వ్యవహరించింది.
చివరకు... అమరావతిని అంగీకరించక తప్పని పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది. నాగార్జున వర్సిటీ దగ్గర పెట్టుకోవాలని జగన్ చెబుతున్నా.. దానికీ.. అమరావతికి తేడా ఏముంటుంది..? అంటే మూడు రాజధానులను మూలకు నెట్టేసినట్లేనా..?





















