YSRCP MP Vijayasai Reddy: చంద్రబాబు నిర్వాకంతో ఏపీకి ఏటా రూ.1300 కోట్లు నష్టం: విజయసాయి రెడ్డి
టీడీపీ హయాంలో చంద్రబాబు తనకు కావాల్సిన డిస్టలరీలకు అడ్డుగోలుగా అనుమతులు మంజూరు చేయించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆరోపించారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అవినీతి స్కాంలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, టీడీపీ హయాంలో తనకు కావాల్సిన డిస్టలరీలకు అడ్డుగోలుగా అనుమతులు మంజూరు చేయించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నిర్వాకంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1300 కోట్లు నష్టం వాటిల్లుతోందని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు ఈ అంశంపై ఆయన స్పందించారు. క్విడ్ ప్రోకోలో భాగంగా నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీనే మార్చేసిందని ఆరోపించారు. ఈ మేరకు నమోదు చేసిన లిక్కర్ స్కాం కేసులో చంద్రబాబు ఏ3 గా ఉన్నారని అన్నారు.
బాధితులకు సీఎం జగన్ భరోసా
విజయనగరం రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని విజయసాయి రెడ్డి అన్నారు. స్వయంగా వెళ్లి పరామర్శించి, ఓదార్చి ఉదారంగా పరిహారం ప్రకటించి, బాధితులకు భరోసా కల్పించారని చెప్పారు. బాధితులు పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తుందని, బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు సీఎం భరోసా కల్పించారని విజయసాయి రెడ్డి అన్నారు. అలాగే రైలు ప్రమాదం కారణంగా వైకల్యం ఏర్పడి ఉపాధి పొందలేని వారికి రూ.5 లక్షలు, శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ. 10 లక్షలు పరిహారం ప్రకటించారు.
రైలు ప్రమాదాలు అరికట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలి
ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. రైలు ప్రమాదాలకు మానవ తప్పిదం లేదా సాంకేతిక లోపం కారణమైనప్పటికీ తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించి తక్షణమే రైలు ప్రమాదాలు అరికట్టి, పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైల్వేకు ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రతి ప్రయాణికుడు సురక్షిత ప్రయాణం రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యత అని విజయసాయి రెడ్డి అన్నారు.