Rayadurgam News: వేదికపైనే వైసీపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలు - ఎమ్మెల్యే అసహన వ్యాఖ్యలు
Anantapur News: ఒకే వేదికపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శలు చేయగా, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ప్రతి విమర్శలు చేశారు.
Anantapur News: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో జరిగిన నాలుగో విడత ఆసరా మహిళలకు అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ప్రస్తుత రాయదుర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి ల మధ్య వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారింది.
ఒకే వేదికపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శలు చేయగా, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ప్రతి విమర్శలు చేయడం అక్కడ చేరిన మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాపు రామచంద్రారెడ్డి ప్రస్తుతం వైసీపీ టికెట్ దక్కించుకున్న ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి పై తనదైన శైలిలో విరుచుకుని పడ్డారు. ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నంత మాత్రాన గెలవలేరని జోష్యం చెప్పడంతో పాటు వ్యంగస్త్రాలను సందించారు. తాను జీవించినంత కాలం రాయదుర్గం ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.
ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విషయాలు సమావేశంలో ప్రస్తావించడం సరికాదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే కాక ముందే దేవాలయాలకు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చానని, ప్రజలకు కంటి ఆపరేషన్లు చేయించి ఆసుపత్రికి మంచాలు ఇచ్చానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోయే వ్యక్తిని కాదని ధీమా వ్యక్తం చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో ఆసరా కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో మెట్టు వర్గీయులు సభలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సభాస్థలం నుంచి వెళ్లిపోయారు.