Ysrcp Complaint: సీఎం జగన్ పై దాడి ఘటన - ఎన్నికల సంఘానికి వైసీపీ నేతల ఫిర్యాదు
Andhrapradesh News: సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని.. పలు అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
Ysrcp Complaint To Ec on Attack on Cm Jagan Incident: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర నేతలు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా సీఈసీతో.. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా ఇతర నేతలు భేటీ అయ్యారు. సీఎం దాడిపై వెనుక కుట్ర కోణం ఉందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఈసీకి అందించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 'సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఆయన ఎడమ కన్నుకు గాయమైంది. ఈ ఘటనను ప్రధాని మోదీ సహా.. రాజకీయాలకు అతీతంగా పలు రాష్ట్రాల నేతలు ఖండించారు. విపక్ష నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ పై దాడి ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయం. ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్లు స్పష్టం అవుతోంది. పదునైన వస్తువు జగన్ కంటిపై తగిలి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి తగిలింది. కొంచెం ఉంటే వెల్లంపల్లి కన్ను పోయుండేది. ఏదైనా ఎయిర్ గన్ నుంచి షూట్ చేసినట్లు తెలుస్తోంది.' అని సజ్జల తెలిపారు. ఈ అంశాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
సిట్ ఏర్పాటు
మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా.. దీనిపై విచారణ కోసం సీపీ కాంతి రాణా సిట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 20 మంది సభ్యులతో 6 ప్రత్యేక బృందాలు విచారణ చేస్తుండగా.. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం వారి నుంచి వివరాలు సేకరించనుంది. ఇప్పటికే, ఈ ఘటనకు సంబంధించి సీపీ ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి రాయితో దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. అటు, ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల సమయంలో రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇటీవల చిలకలూరిపేటలోని ప్రధాని సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. అప్పుడు ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. తాజాగా, సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
నిఘా విభాగం అలర్ట్
అటు, సీఎం జగన్ పై రాయి దాడి ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రతపై నిఘా విభాగం అప్రమత్తమైంది. గుత్తిలో జగన్ కాన్వాయ్ పై చెప్పులు.. ఇప్పుడు రాళ్లు విసరడంతో హైఅలర్ట్ ప్రకటించింది. సభల్లో ర్యాంప్ వాక్ చెయ్యొద్దని జగన్ కు భద్రతాపరమైన సూచనలు చేసింది. జగన్ బస్సు పరిసరాల్లోకి అనుమతిపై సైతం ఆంక్షలు విధించనున్నారు. 'జగన్ కు, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలి. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలి. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించాలి. మరీ అవసరమైతేనే జగన్ బస్సుకు దగ్గరగా నేతలు, కార్యకర్తలను అనుమతించాలి.' అని భద్రతా సిబ్బందికి కీలక సూచనలు ఇచ్చింది. వీలైనంత వరకూ బస్ లో కూర్చునే రోడ్ షోలు నిర్వహించాలని సీఎం జగన్ కు నిఘా వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
Also Read: Central Election Commission: సీఎం జగన్ పై దాడి ఘటన - కేంద్ర ఎన్నికల సంఘం ఆరా