(Source: ECI/ABP News/ABP Majha)
Vivekananda Reddy Murder Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి ఉపశమనం, మధ్యంతర బెయిల్ మంజూరు
Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. నవంబర్ 30 వరకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది.
Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి మధ్యంతర బెయిల్ లభించింది. నవంబర్ 30 వరకు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ కోర్టు (CBI Court) మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు పలు షరతులు విధించింది. భాస్కర్‌రెడ్డి తన పాస్‌పోర్టును సరెండర్ చేయడంతో పాటు తన చిరునామా వివరాలు కోర్టు, సీబీఐకి ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఏదైనా ఆరోగ్య సమస్యలతో చికిత్సకు వెళ్లాల్సి వస్తే ఆ వివరాలను సీబీఐకి తెలపాలని సూచించింది. కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరిని కలవొద్దని తెలిపింది. నిర్దేషిత బెయిల్ సమయం పూర్తయిన తరువాత డిసెంబర్ 1న ఉదయం 10.30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. సెప్టెంబర్ 20 నుంచి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బెయిల్‌ను మధ్యంతర బెయిల్‌గా మారుస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ 16న అరెస్ట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 120బీ రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీఐబీ అధికారులు పులివెందుల నుంచి హైదరాబాద్ తరలించారు. వివేకాను హతమార్చిన తర్వాత సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం జరగడం వెనుక భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేసింది సీబీఐ.
ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా..
అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉంటున్న భాస్కర్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వాటిని కోర్ట్ తిరస్కరిస్తూ వచ్చింది. సెప్టెంబర్ నెలలో భాస్కర్ రరెడ్డి తన అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజులు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటు ఆయన ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్ట్ సానుకూలంగా స్పందించింది.
మొదటి సారి 12 రోజులు బెయిల్
సెప్టెంబర్ 20న ఆయనకు ఎస్కార్ బెయిల్ మంజూరు చేసింది. 12 రోజుల పాటు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఎస్కార్ట్‌కు అయ్యే ఖర్చులు భరించాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. బెయిల్ ముగిసిన తర్వాత ఆయన మళ్లీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. మళ్లీ అక్టోబర్ 1 వారం పాటు బెయిల్ పొడిగిస్తూ తెలంగాణ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అనుమతించారు.
కంటికి కాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్నానని, వైద్యుల సూచన, తదుపరి చికిత్సల కోసం రెండు నెలల పాటు పొడిగించాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు నవంబరు 1 వరకు ఎస్కార్ట్ బెయిల్ పొడిగించింది. తాజాగా నవంబర్ 30 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది.