YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి
వివేకా హత్య కేసులో నిందితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధర్ రెడ్డి అనుచరుడు గా ఉన్నాడు. లవ్ మ్యారేజీ చేసుకొని అనంతపురం జిల్లా యాడికిలో గంగాధర్ రెడ్డి ఉండేవాడు.
YS Vivekananda Reddy ఛurder Case Updates: వైఎస్ వివాకానంద రెడ్డి సంచలనాత్మక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. వివేకా హత్యకేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా యాడికిలో మృతి చెందాడు. గంగాధర్ రెడ్డి రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లుగా బంధువులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల కూడా పరిశీలన జరుపుతున్నారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.
వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ కేసులో కీలక వ్యక్తులు బయటకు వచ్చిన క్రమంలో ఇప్పుడు గంగాధర్ రెడ్డి మృతి కలకలం రేపుతోంది. వివేకా హత్య కేసులో ఈ గంగాధర్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటికే విచారణ చేసింది. గతంలో వివిధ సందర్భాల్లో 3 సార్లు కడపకు పిలిపించుకుని సీబీఐ అతణ్ని ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధర్ రెడ్డి అనుచరుడు గా ఉన్నాడు. లవ్ మ్యారేజీ చేసుకొని అనంతపురం జిల్లా యాడికిలో గంగాధర్ రెడ్డి ఉండేవాడు. స్వగ్రామం పులివెందుల నుంచి యాడికి వచ్చిన గంగాధర్ రెడ్డి ప్రాణ ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ గతంలో రెండు సార్లు అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. నిందితుల పేర్లు చెప్పాలని తనను సీబీఐ బెదిరిస్తోందంటూ ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశారు.
Also Read: Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి
కేసులో కీలక వ్యక్తుల మరణం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ 3వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ భాస్కర్ రెడ్డికి, సీఎం జగన్ కు లేఖ కూడా ఆయన రాశాడు. పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ రెడ్డిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి కూడా అప్పుడు మరణించాడు.