ys viveknanda reddy murder case : వాచ్‌మెన్ రంగయ్య ఏం చెప్పాడు? వైఎస్ వివేక హత్య కేసులో సస్పెన్స్
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. కేసు కొలిక్కి వస్తున్న టైంలో కీలక అధికారి బదిలి అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ కేసు విచారణలో కీలక వ్యక్తి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు
మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇన్నాళ్లు చాలా మందిని విచారించిన కేంద్రదర్యాప్తు సంస్థ... మరో అడుగు ముందుకేసింది. 47 రోజులుగా కడప సెంట్రల్‌జైల్ గెస్ట్‌హౌస్‌లో అనుమానితులను విచారించిన అధికారులు.. దర్యాప్తులో కీలక స్టెప్ వేశారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న స్టేట్‌మెంట్ నమోదు చేశారు.
ఉదయం కడప నుంచి సీబీఐ అధికారులు రంగన్నను తీసుకుని జమ్మలమడుగు వెళ్లారు. 11 నుంచి 12 గంటల మధ్యలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మెజిస్ట్రేట్ ఫకృద్ధీన్ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మెజిస్ట్రేట్, రంగన్న తప్ప వేరేవాళ్లు ఎవరూ లేరు. స్టెనో కూడా లేకుండా మెజిస్ట్రేట్ స్వయంగా వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం.
పులివెందుల మెజిస్ట్రేట్ అందుబాటులో లేనందున ఇన్ ఛార్జిగా ఉన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందుకు సీబీఐ అధికారులు రంగన్నను తీసుకెళ్లారు. తర్వాత రంగన్నను కడపకు తరలించారు. మెజిస్ట్రేట్ రికార్డు చేసిన వాంగ్మూలం పరిశీలించిన తర్వాత సీబీఐ అధికారులు ఎలా మూవ్ అవుతారన్నది ఇప్పుడు సస్పెన్స్.
47 రోజులుగా కడపలోనే మకాం వేసిన దర్యాప్తు సంస్థ అధికారులు.. చాలా మంది అనుమానితులను రోజూ ప్రశ్నిస్తున్నారు. అవసరాన్ని బట్టి పులివెందులకు సైతం వెళ్లి విచారిస్తున్నారు.
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న అధికారి బదిలి కలకలం రేపుతోంది. ఎంక్వయిరీని పరిశీలిస్తున్న సీబీఐ డీఐజీ సుధాసింగ్ స్థానంలో ఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. దర్యాప్తు కీలక దశకు చేరుకున్న టైంలో ఈ మార్పుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ అధికారి బదిలీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు మరో మలుపుగా ప్రచారం జరుగుతోంది. సీబీఐలో డీఐజీ ర్యాంకు హోదాలో దాదాపు ఏడాది నుంచి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సుధాసింగ్ మార్పుపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏడాది నుంచి ఈ కేసులో సుధాసింగ్ పలువురు కీలక అనుమానితులను విచారించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి పిలిపించి వారందర్నీ ప్రశ్నిస్తున్నారు. ఈ టైంలో సుధాసింగ్ మార్పు సంచలనంగా మారింది.
౩ రోజుల కిందట సుధాసింగ్‌ను దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించారు. ఆమె ప్లేస్‌లో మరో అధికారిని నియమించినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ డీఐజీ సుధాసింగ్ స్థానంలో ఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వివేకా కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఉన్నతస్థాయి అధికారిని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులో ఇప్పటికే 30 మందికి పైగానే కీలక అనుమానితులను సీబీఐ అధికారులు నాల్గోదఫా విచారించారు. ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ కుటుంబం, జగదీశ్వర్ రెడ్డి సోదరులు, వాచ్ మెన్ రంగన్న, పని మనుషులను విచారించారు. ఇవాళ వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. కొత్త ఎస్పీ స్థాయి సీబీఐ అధికారి ఇంకా కడపకు రాలేదు.
ALSO READ: పిల్లలూ.. ఆగస్టు 16 నుంచి బడి గంట మోగనుంది