YS Viveka murder case: వివేకా హత్య కేసు.. వాగులో ఆయుధాలు పాతిపెట్టారా? సీబీఐ అధికారులు నీటిని ఎందుకు తోడిస్తున్నారు?
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. హత్యకు సంబంధించిన ఆయుధాల కోసం పులివెందుల తూర్పు ఆంజనేయస్వామి గుడిపక్కన వాగులో సీబీఐ తనిఖీలు చేసింది.
వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే విచారణను వేగవంతం చేసిన అధికారులకు.. మరో కీలక అప్ డేట్ దొరికినట్టు తెలుస్తోంది. ఈనెల 2న గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్‌ను అధికారులు కస్టడీకి తీసుకుని రెండో రోజు విచారిస్తున్నారు. అయితే సునీల్ ఇచ్చిన సమాచారంతోనే వివేకా హత్యకు సంబంధించిన ఆయుధాల కోసం అధికారులు గాలింపు చేపట్టారు. పులివెందుల ఆంజనేయస్వామి గుడిపక్కన వాగులో తనిఖీలు చేస్తున్నారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులోని నీటిని తోడిస్తున్నారు అధికారులు. పులివెందులలోని రోటరీపురం వద్ద ఉన్న బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజ్‌లో కూడా మారణాయుధాల కోసం గాలింపు కొనసాగుతుంది.
రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులోని నీటిని తోడిస్తున్నారు. పోలీస్ ఎస్కార్ట్ మధ్య సునీల్‌ను సెంట్రల్ జైల్ నుంచి పులివెందులకు తీసుకువచ్చారు. సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 2న అనుమానితుడు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌లో కడప సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. సునీల్‌ను 13 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజులకు మాత్రమే అనుమతి లభించింది. ఈనెల 16 వరకు విచారించనుంది.
అంతకముందు సునీల్‌తో పాటు ఆయన తమ్ముడు కిరణ్‌యాదవ్, తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్‌లను సీబీఐ ప్రశ్నించింది. విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ హైకోర్టుకు వెళ్లాడు.
అయితే సునీల్ యాదవ్ కుటుంబం మొత్తం వైఎస్ వివేకాకు సన్నిహితులు. వారితో అత్యంత చనువుగా ఉంటున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివేకా హత్య కేసు వెనుక మిస్టరీ సునీల్‌కు తెలిసే ఉంటుందని.. లేకపోతే.. ఆ కుట్రలో భాగమై ఉంటారని సీబీఐ అధికారులు నమ్ముతున్నారు. ఈ కేసు కోసం ఇప్పటికే రెండు నెలలుగా సీబీఐ అధికారులు పులివెందులలోనే మకాం వేశారు. కేసును చేధించి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. సాక్ష్యాలు మాయం చేసిన వారిని... మాయం చేయడానికి ప్రయత్నించిన వారిని సీబీఐ అధికారులు ఇంత వరకూ ప్రశ్నించలేదు. సునీల్ యాదవ్ కస్టడీలో చెప్పే విషయాలను బట్టి సీబీఐ.. వారిపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వివేకా కేసు దర్యాప్తు మాత్రం కీలక దశకు చేరుకుందని సీబీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో శనివారం నలుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నించారు. డ్రైవర్ దస్తగిరి, సుంకేసుల గ్రామానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయమే కడప రైల్వే స్టేషన్ మాస్టర్ మోహన్ రెడ్డిని విచారణ చేసినట్టు తెలుస్తోంది. నేటితో 62 రోజులుగా ఈ కేసులో సీబీఐ విచారణ సాగుతుంది.