ఏపీలో YSR మార్క్ కాదు, జగన్ మార్క్ పాలన - హత్యా రాజకీయాలు, రౌడీపాలన: షర్మిల
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ మార్క్ పాలన లేదని, జగన్ మార్క్ పాలన.. అరాచక పాలన, హత్యా రాజకీయాల పాలన కొనసాగుతోందని ఏపీ పీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
YS Sharmila Comments: పూతలపట్టు: ‘ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నది YSR మార్క్ పాలన కాదు, జగన్ మార్క్ పాలన. సీఎం జగన్ YSR పేరును పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. పథకాల్లో వైఎస్ఆర్ పేరు మాయం. సాక్షి టీవీలో సైతం పేరు వైఎస్సార్ మాయం’ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉన్నది రౌడీల పాలన, హత్యా రాజకీయాల పాలన అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పాలన కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
ఎన్నికలు రాగానే వైసీపీ, టీడీపీ ఓటుకు రూ.5 వేలు ఇస్తారట. వాళ్లు ఎంత ఇచ్చినా తీసుకోవాలని, అవి అక్రమంగా సంపాదించిన డబ్బులేనని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు అనేది మీ ఆయుధం, ఈ సారి ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. ఈ సారి వేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్ కోసం వేయాలి. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయంటూ మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాంతో ఇద్దరి పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని విమర్శలు గుప్పించారు.
‘10 ఏళ్లు హోదా ఉండి ఉంటే దేశంలో నెంబర్ 1 ఉండేది. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ప్రతి నియోజక వర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. - హోదా 15 ఏళ్లు కావాలని చెప్పి మోసం చేశారు. హోదా అడిగితే కేసులు పెట్టారు. మొదటి 5 ఏళ్లు హోదా రాకుండా చంద్రబాబు మోసం చేశారు. తర్వాత జగన్ ఎంపీలు రాజీనామా అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కరోజు హోదాపై మాట్లాడలేదు. టీడీపీ, వైసీపీ అధినేతలు బీజేపీ కి దాసోహం, బానిస అయ్యారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో పోటీ పడిమరి పొత్తులు పెట్టుకుంటున్నారు’ - వైఎస్ షర్మిల
రాజధాని లేదు, నిరుద్యోగం 10 రెట్లు పెరిగింది.
ఏపీకి రాష్ట్రానికి రాజధాని ఎందుకు లేదంటే.. ఒక ముఖ్యమంత్రి రాజధానిపై 3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్ 3 రాజధానులు అన్నారు. సీన్ కట్ చేస్తే 10 ఏళ్లు గడిచే సరికి ఏ రాజధాని లేదు. రాష్ట్రంలో జగన్ పాలనలో మోసపోని వర్గం లేదు. రైతులను అప్పుల పాలు చేశారు. అప్పులేని రైతు ఏపిలో లేనే లేడు. వ్యవసాయం దండుగ అన్నట్లు మార్చేశారు. చివరికి డ్రిప్ మీద సబ్సిడీ కూడా ఎత్తివేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం 10 రెట్లు పెరిగింది. అధికారంలో వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. జగనన్న కుంభకర్ణుడి లెక్క ఇన్నాళ్లు నిద్ర పోయారు. ఎన్నికల ముందు నిద్రలేచి జాబ్ నోటిఫికేషన్లు అని హడావుడి చేస్తున్నారు - వైఎస్ షర్మిల
మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పే జగన్ మద్య నిషేధం అని చెప్పి సర్కారే మద్యం అమ్ముతోందని సెటైర్లు వేశారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వైఎస్సార్ ఆశయాలు నిలబెట్టడం అంటే ఇదేనా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని విమర్శించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా ప్రత్యేక హోదాపై సంతకం చేస్తామన్నారు.