YS Jagan : వినుకొండలో రషీద్ కుటుంబానికి జగన్ పరామర్శ - అండగా ఉంటానని భరోసా
Andhra Pradesh : వినుకొండ రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. న్యాయం జరిగే వరకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
YS Jagan visited the family of Vinukonda Rashid : వినుకొండలో రెండు రోజుల కిందట దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు హత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షల కారణంగా హత్యలు చేశారని చెబుతన్నారని.. కానీ రాజకీయ కక్షల కారణంగానే హత్య చేశారని రషీద్ తల్లి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. హంతకుడు జిలానీ కాల్ రికార్డులు తీస్తే .. ఎవరెవరితో మాట్లాడారో స్పష్టత వస్తుందన్నారు. రషీద్ హత్య వెనుక కుట్ర ఉందని.. ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో లేవన్నారు.
నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయని ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారన్నారు. తన కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్ తల్లిదండ్రులు జగన్ ను కోరారు. టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్‌కు రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. ‘‘హత్య వెనుక ఎవరున్నా వదలం. మీ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని ర జగన్ వారికి ధైర్యం చెప్పారు. సుధాకరన్నకు ఫోన్ చేస్తే అన్నీ చూసుకుంటారని హామీ ఇచ్చారు. [
వినుకొండలో రషీద్ నివాసానికి చేరుకున్న వైయస్ జగన్ గారు.
— YSR Congress Party (@YSRCParty) July 19, 2024
రషీద్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైయస్ జగన్ గారు.#SaveAPFromTDP pic.twitter.com/PP4xGr34Y3
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారని.. ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని రషీద్ కుటుంబసభ్యులతో జగన్ అన్నారు.
ఉదయం పదొండు గంటల సమయంలో తాడేపల్లి నుంచి బయలుదేరిన వైసీపీ అధినేత సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ చేరుకున్నారు. చాలా చోట్ల వైసీపీ నేతలు జన సమీకరణ చేసి.. రోడ్డు బలప్రదర్శన చేశారు. అదే సమయంలో వర్షం కూడా పడుతూండటంతో.. వాహన శ్రేణి నెమ్మదిగా సాగింది.
మాజీ సీఎం హోదాలో ఉన్నందున జడ్ ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. అయితే జగన్ ఆ వాహనంలో ప్రయాణించలేదు. ప్రైవేటు వాహనంలో వెళ్లారు. ఆ వాహనం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిందని వైసీపీనేతలు ప్రచారం చేశారు. కానీ అది అబద్దమని వాహన శ్రేణిలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.