(Source: ECI/ABP News/ABP Majha)
MP Gorantla Madhav: 'నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది' - చంద్రబాబు చస్తారన్న వ్యాఖ్యలపై గోరంట్ల క్లారిటీ
7MP Gorantla Madhav: చంద్రబాబుపై తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారనేదే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారని వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారనేదే తన ఉద్దేశం అని స్పష్టం చేశారు. 'నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది. పద దోషంతో చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. వ్యాఖ్య నిర్మాణ లోపం వల్ల అలా మాట్లాడాను. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారనేదే నా ఉద్దేశం. నా వ్యాఖ్యలు వక్రీకరించి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఎన్నికల తర్వాత టీడీపీ సమాధి అవుతుంది.' అని గోరంట్ల మాధవ్ అన్నారు.
గోరంట్ల ఏమన్నారంటే.?
నాలుగున్నరేళ్లలో వైసీపీ చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం శింగనమలలో బస్సు యాత్రలో పాల్గొన్న గోరంట్ల, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. '2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారు. చంద్రబాబు చస్తారు. ఇది గ్యారెంటీ. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, పంచాయితీ నుంచి మొదలుకొని మండలాలు, జడ్పీ, మంత్రివర్గం, డిప్యూటీ సీఎంల వరకూ.. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉండేలా వారికి అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తున్నాం. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.' అని గోరంట్ల వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతల ఆగ్రహం
గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ గోరంట్ల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ వీడియోను వైరల్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు. మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు బాహాటంగానే చంద్రబాబును చంపేస్తామంటూ చెబుతున్నారని మండిపడ్డారు.
తాజాగా, ఈ అంశంపై వివరణ ఇచ్చిన గోరంట్ల, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉచ్ఛరణ దోషంతోనే అలా వ్యాఖ్యానించినట్లు స్పష్టం చేశారు.
Also Read: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల - కంటికి ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు