Yarlagadda Venkatrao :టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు - వైసీపీలో అవమానించారని ఆవేదన !
వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సజ్జల ఉంటే ఉండు..పోతే పో అనడం బాధించిందన్నారు.
Yarlagadda Venkatrao : పార్టీ కోసం అన్నీ చేసినా ఉంటే ఉండు.. పోతే పో అని సజ్జల రామకృష్ణారెడ్డి అవమానించారని గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన ఆయన పార్టీలో తనకు ఎదురవుతున్న పరిస్థితుల్ని ఏకరువు పెట్టారు. ఎక్కువ మంది అనుచరులు టీడీపీలో చేరాలని సూచించడంతో ఆయన .. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. తాను గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కోసం అన్నీ చేశానన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. తనకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నానని చెబితే బాగుండేది కానీ.. ఉంటే ఉండు..పోతే పో అనడం ఏమిటని ఆవేదన వ్యక్తం చే్శారు. తాను పార్టీని టిక్కెట్ తప్ప ఏమీ అడగలేదన్నారు. వైఎస్ఆర్ ఉండి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్ మెంట్ కావాలని యార్లగడ్డ వెంకట్రావు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల అనడాన్నికలలో కూడా ఊహించలేకపోయానన్నారు. టీడీపీ కంచుకోటలో తన వంతు పోరాటం చేశానని.. నా బలం ఇప్పుడు బ లహీనత అయిందా అని.. యార్లగడ్డ వైసీపీ హైకమాండ్ ను ప్రశ్నించారు. నమ్మిన మనుషుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తే..గన్నవరంలో గెలిచి చూపిస్తానన్నారు.
అమెరికాలో వ్యాపారాలు చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరారు. మొదట పెనుమలూరు నియోజకవర్గంలో పని చేసుకున్నారు. తర్వాత గన్నవరం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేశారు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే వంశీ వైసీపీలో చేరడంతో.. ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. టీడీపీలో ఉండగా.. తమను నానా ఇబ్బందులు పెట్టారని.. వైసీపీ క్యాడర్ పై కేసులు పెట్టారని వంశీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆయన యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మరో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు కూడా ప్రకటించారు. అయినా సమస్య పరిష్కారానికి హైకమాండ్ ప్రయత్నించలేదు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీలో ఉండే ఉండొచ్చు.. పోతో పోవచ్చని వ్యాఖ్యానించారు. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆయన ..పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీలో చేరేందుకు అపాయింట్ మెంట్ కావాలని యార్లగడ్డ కోరుతున్నారు. అయితే యువగళం పాదయాత్ర.. శనివారం కృష్ణా జిల్లాలోకి రానుంది. గన్నవరం నియోజకవర్గంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలోనే యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వెంకట్రావ చేరికకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.