YS Birth Anniversary YSRCP : వైఎస్ 75వ జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - క్యాడర్ అంతా పాల్గొనేలా కార్యక్రమాలు
YSR Birth Anniversary : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
YCP is making arrangements for YS 75th birth anniversary : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఊరిలోనూ వైసీపీ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణ చేయడం, మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, పిల్లలకు స్కూల్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయవచ్చునని పార్టీలతో సంబంధం లేదన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జయంతి
వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా , రాహుల్ గాంధీలు సహా పలువులు కీలక నేతల్ని ఆహ్వానించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో వైఎస్ తో సాన్నిహిత్యం ఉన్న అందర్నీ ఆహ్వానించారు. వీరిలో ఎంత మంది వస్తారో కానీ.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి కీలక నేతలు వస్తారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి వైఎస్ జయంతిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
వైఎస్ కాంగ్రెస్ సొంతమనేలా షర్మిల వ్యూహం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు జయంతి వేడుకలను షర్మిల ఉపయోగించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందేందుకు షర్మిల రాజకీయంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించడాన్ని టాస్క్ గా తీసుకుని పని చేస్తున్నారు. వైఎస్ జయంతి రోజున కొంత మంది కీలక నేత్లని పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు.
చనిపోయే వరకూ కాంగ్రెస్ లోనే ఉన్న వైఎస్ఆర్
వైఎస్ఆర్ చనిపోయే వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాహల్ గాంధీని ప్రధానిని చేయడం తమ లక్ష్యమని ఆయన చెబుతూ ఉండేవారు. గాంధీ కుటుంబానికి వీర విధేయంగా ఉండేవారు. అయితే ఆయన ప్రమాదవశాత్తూ చనిపోయిన తర్వాత వైఎస్ కుటుంబం పార్టీకి దూరమయింది. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదన్న కారణం చెప్పారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చిన తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో మళ్లీ వైఎస్.. కాంగ్రెస్ మధ్య అనుబంధం తెరపైకి వస్తోంది. ఇప్పుడు వైఎస్ లెగసీతో మరోసారి కాంగ్రెస్ ను బలపరిచేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.