Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు ధ్వంసంచేయడంపై వైసీపీ ఆగ్రహం - విచారణ చేయించాలని డిమాండ్
YSRCP : విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగించడంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు చేశారని పోలీసులు చెబుతున్నారు. విచారణ చేయించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
Andhra YSRCP : విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నిర్మంచిన అంబేద్కర్ విగ్రహం పేరుతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనే అక్షరాలను కొంత మంది దుండగులు తొలగించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్‌సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేశారు. టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీకి సంబంధం లేదని గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పేరును తొలగించారని అంటున్నారు.
విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరిలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రారంభించారు. విగ్రహం ముందు ‘భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం... ఆవిష్కర్త శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రివర్యులు’ అంటూ స్టీల్ ఎంబోజ్డ్ అక్షరాలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కొందరు దుండగులు ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి’ పేరున్న అక్షరాలు పీకేశారు.
ప్రభత్వ వర్గాలు కానీ... అధికారులు కానీ ఇలా చేయాలని ఎవరినీ ఆదేశించలేదు. కానీ కొంత మంది దుండగులు ఈ పని చేయడంతో రాజకీయ ప్రేరేపితంగానే భావిస్తున్నారు. అందుకే వెంటనే జగన్ రెడ్డి పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయలేదు. అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. జగన్ పేరును తొలగించడం పెద్ద తప్పేం కాదని వైసీపీ నేతలకు పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాలు చేస్తున్నారు.
అంబేద్కర్ స్మృతివనం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు కూడా ఫిర్యాదు చేయాలని వారిని అడగలేదు. ధ్వసం చేసింది అక్షరాలేనని .. ఇంకేమీ చేయలేదనిచెబుతున్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పోలీసులు చర్యలు తీసుకుంటారని అక్కడపెద్దగా ఏమీ జరగలేదని..పైగా పోలీసులకు ఫిర్యాదు రాలేదని అంటున్నారు.
అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం.. చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగిందని.. సాక్షాత్తూ అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని వారు అంటున్నారు. జగన్ పేరు తొలగిపును విగ్రహంపై దాడిగా చెబుతున్నారు. విగ్రహాన్ని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారని.. విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు.అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దగా పెట్టుకున్నారని.. దానిని తొలగించాలన్న డిమాడ్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి.. పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కానీ జగన్ పేరు మళ్లీ పెట్టాల్సిందేనని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ పేరు లేకుండా చేయడానికే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.