CM Jagan: 'పేదోడి విజయానికి బాటలు వేయాలి' - సామాజిక సాధికార యాత్రపై సీఎం జగన్ ట్వీట్
CM Jagan: ఏపీలో నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చి, అందరికీ సంక్షేమం అందేలా చేశామని సీఎం జగన్ అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని సీఎం జగన్ మంత్రులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. గురువారం నుంచి వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'మన ప్రభుత్వంలో నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఓ హక్కుగా ప్రభుత్వం వారికి అందించింది. గత 53 నెలల కాలంలో రూ.2.38 లక్షల కోట్ల డీబీటీలో 75 శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం.' అంటూ జగన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పరిపాలన. ఉన్నత విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యతతో ముస్లింలలో పెరిగిన అక్షరాస్యత. ఆసరా, చేయూత వంటి పథకాలతో మైనారిటీ అక్కచెల్లెమ్మలకు అండదండగా వైయస్ జగన్ సర్కార్.
— YSR Congress Party (@YSRCParty) October 26, 2023
#SamajikaSadhikaraYatra pic.twitter.com/2o4XvEMiJm
మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం… pic.twitter.com/kcj6CkhDOE
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2023
ఎక్కడా వెనకడుగు వేయలేదు
చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఈ వర్గాలకు కేటాయిస్తూ పట్టం కట్టిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానిదేనని సీఎం జగన్ తెలిపారు. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరుగబోతోందని అన్నారు. 'సామాజిక సాధికార యాత్ర' ద్వారా వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయాన్ని ప్రజల్లో ప్రతిధ్వనించేలా చేయాలని మంత్రులు, వైసీపీ శ్రేణులకు సూచించారు. ఈ యాత్ర ద్వారా పేదవాడి విజయానికి బాటలు వేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే
- అక్టోబర్ 26 - ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల
- అక్టోబర్ 27 - గజపతినగరం, నరసాపురం, తిరుపతి
- అక్టోబర్ 28 - భీమిలి, చీరాల, పొద్దుటూరు
- అక్టోబర్ 30 - పాడేరు, దెందులూరు, ఉదయగిరి
- అక్టోబర్ 31 - ఆమదాలవలస, నందిగామ, ఆదోని
- నవంబర్ 1 - పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి
- నవంబర్ 2 - మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు
- నవంబర్ 3 - నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి
- నవంబర్ 4 - శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం
- నవంబర్ 6 - గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం
- నవంబర్ 7 - రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ
- నవంబర్ 8 - సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్
- నవంబర్ 9 - అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె
ఆదివారాలు మినహా రోజూ రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజులు సభలు జరుగుతాయని వైసీపీ శ్రేణులు తెలిపాయి. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తుండగా, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.