AP News: భర్త చనిపోతే సాయం చేస్తామని చెప్పి, వేధిస్తున్నారంటూ మహిళ కన్నీళ్లు!
Telugu News: భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో నిస్సాహాయ స్థితిలోఉన్న తనను ఆదుకుంటామని చెప్పిన వైసీపీ నేతలు.. వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది.
Paritala Sunitha Meeting: కనగానపల్లి: వైసీపీ ప్రభుత్వంలో మహిళలు, బీసీలు ఎదుర్కొంటున్న అరాచకాలకు ఓ మహిళ కన్నీటి ఆవేదన ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది. ‘కరోనా సమయంలో భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో నిస్సాహాయ స్థితిలోఉన్న మహిళను ఆదుకుంటామని చెప్పిన వైసీపీ నేతలు.. అలా చేయకపోగా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతిపరురాలిగా ఉన్న ఒక బీసీ(బోయ) మహిళ ఓ సభలో వంద మంది ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
కనగానపల్లి మండలం భానుకోటలో మాజీ మంత్రి పరిటాల సునీత.. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. గ్రామానికి చెందిన బీసీ మహిళ గౌతమి తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కరోనా సమయంలో ఆమె భర్త కుంపటి కుళ్లాయప్ప చనిపోయారు. దీంతో చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో అనాధగా మారానని గౌతమి ఆమె వాపోయింది. భర్త చనిపోయిన సమయంలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తనకు అండగా ఉంటామని.. ఏ కష్టం వచ్చినా మాకు చెప్పాలని ధైర్యం చెప్పారన్నారు. కానీ వారి మాటలు నమ్మిన నాకు మూడేళ్లుగా నరకం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
వైసీపీ సానుభూతిపరురాలైన తనకు ఇప్పటివరకు పింఛన్ తప్ప ఏమీ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి బిల్లులు కూడా పడలేదని తెలిపింది. ఏవైనా పథకాల కోసం కాగితాలు తీసుకుని రమ్మంటారని.. సుమారు 5వేలు ఖర్చు పెట్టి వాటిని తీసుకెళ్తే అవి పనికి రావని తిప్పి పంపారని వాపోయింది. పైగా కొందరు వ్యక్తులు తనతో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తన బంధువులే దాడి చేస్తున్నా.. ఎవరూ రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే రాత్రి 10గంటల వరకు ఎస్ఐ రాలేదు, సీఐ రాలేదంటూ కూర్చోబెడుతారని ఆరోపించింది.
ఇప్పటికీ తనపై దాడులు జరుగుతున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వాపోయింది. వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పారని.. కానీ ఇప్పటి వరకు మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పరిటాల సునీత దయ తలిచి తనను, తన పిల్లల్ని రక్షించాలని వేడుకుంది. బాధిత మహిళ పరిస్థితి విని పరిటాల సునీత చలించిపోయారు. వైసీపీ అరాచకాలకు ఇంతకు మించి సాక్ష్యాలు ఏం ఉంటాయని ప్రశ్నించారు. ఆ మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. టీడీపీకి ఓటు వేసి జగన్ ను ఇంటికి పంపించాలని ప్రజలకు పరిటాల సునీత పిలుపునిచ్చారు.