Ongole Flexi Issue : ఒంగోలులో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టించింది వైసీపీ నేతలేనా ? వాలంటీర్ చెబుతోంది ఇదే !
ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టిందెవరు ? వాలంటీర్ అసలు నిజాలు చెప్పారా ?
Ongole Flexi Issue : అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అనే కామెంట్‌తో ఎన్టీఆర్ ఫోటోతో ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ ఫ్లెక్సీలపై చంద్రబాబు, సీ నియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఆ డైలాగ్ పెట్టారన్నట్లుగా ఫ్లెక్సీలు ఉన్నాయి. ఎవరు ఏర్పాటు చేశారు.. ఎందుకు ఏర్పాటు చేశారన్నది లేదు. కానీ క్లియర్ గా లోకేష్ ను టార్గెట్ చేశారని స్పష్టమయింది. అందుకే మీడియాలోనూ హైలెట్ అయింది. అయితే.. ఒంగోలులోని జర్నలిస్టులు, టీడీపీ నేతలు వెంటనే.. ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో కనిపెట్టేందుకు రంగంలోకి దిగడంతో చాలా విషయాలు బయటకు వచ్చాయి.
ముందుగా ఫ్లెక్సీలు కట్టేందుకు ఉపయోగించిన ఫ్రేముల్ని ఒంగోలులోని ఓ వాలంటీర్ సరఫరా చేశారు. ఆ విషయం తెలియడంతో మీడియా మొత్తం వాలంటీర్ దగ్గరకు వెళ్లింది. దీంతో వాలంటీర్ అసలు విషయం చెప్పాడు. తమ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు చెప్పాడని.. తాను ఫ్లెక్సీల ఫ్రేమ్స్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఎవరు వచ్చి తీసుకెళ్లారో.. ఫ్లెక్సీలు ఎవరు కట్టారో తెలియదన్నాడు. వైసీపీ నేతలే ఫ్లెక్సీలుతయారు చేయించి.. వాలంటీర్ ద్వారా ఫ్రేములు సరఫరా చేశారని.. డివిజన్ ప్రెసిడెంటే ఇలా చేయించారని టీడీపీ నేతలంటున్నారు.
ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ సభలు, కార్యక్రమాల్లో అక్కడక్కడ .. ఎన్టీఆర్ నినాదాలు వినిపిస్తూ వస్తున్నాయి. ఎన్టీఆర్ సీఎం అని బ్యానర్లు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వారెవరూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాదని ఇతర పార్టీల నేతలే ఇలా చేయిస్తున్నరాని టీడీపీ నేతలు అంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా వైసీపీ సానుభూతిపరులే ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో ఫ్యాన్ వార్స్ చేస్తూంటారన్న విమర్శల్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తూంటారు.
వైసీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తరచూ తెస్తూంటారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ వారసుడు ఆయనేనని అంటూంటారు. ఈ క్రమంలో ఐ ప్యాక్ సలహాతోనే.. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు.. తమ ఐడెంటీటీ తెలియకుండా పోస్టర్లు వేసి రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. నేరుగా రాజకీయం చేయలేక.. రాజకీయాలకు దూరంగా ఇలా రాజకీయాలతో సంబంధం లేని ఎన్టీఆర్‌ను తెస్తున్నారని అంటున్నారు.