Antarvedi Utsavalu : జనవరి 28 నుంచి అంతర్వేది కల్యాణ మహోత్సవాలు
Antarvedi Utsavalu : అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు.
Antarvedi Utsavalu : దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు మొదలయ్యాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. 28వ తేదీ శనివారం రథసప్తమితో అత్యంత వైభవంగా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 31న మంగళవారం రాత్రి 12:46 నిముషాలకు స్వామివారి కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి రధోత్సవం, 5వ తేదీ ఉదయం 8 గంటలకు స్వామివారి చక్రస్నానం, 6వ తేదీ రాత్రి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి రోజు స్వామివారి గ్రామోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
అంతర్వేది కు వన్ వే పద్ధతిలో
ఎప్పటిలాగానే తీర్థంలో వాహనాల రాకపోకలకు పోలీసులు వన్ వేను అమలుచేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చే వాహనాలు టేకిశెట్టిపాలెం వద్ద ప్రధాన రహదారిలో కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేదికి రావచ్చు. తిరుగు ప్రయాణంలో ఆలయం వెనుకవైపు ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్ మీదుగా మలికిపుం, రాజోలు ప్రాంతాలకు వెళ్లవచ్చు. వీటితో పాటు భక్తుల వాహనాలకు గుర్రాలక్క గుడికి సమీపంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుకు పంచాయతీ అధికారులు ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాల నుంచి వాహనాలను గుర్రాలక్క గుడిమీదుగా ఉన్న దండుపుంత బీటీ రోడ్డులో అంతర్వేదికర వద్ద మలుపు తిరిగి గంగయ్యవారధి, గొంది పాములవారి సెంటర్ మీదుగా సఖినేటిపల్లి మూడు తూములు సెంటర్ మీదుగా ప్రధాన రహదారిపైకి చేరుకోవాలి.
అంతర్వేది పుణ్య క్షేత్రం ఎంతదూరం..
అంతర్వేది, రాజోలు నుంచి 31 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 104, అమలాపురం నుంచి 63, కాకినాడ నుంచి 118, పాలకొల్లు నుంచి 41, భీమవరం నుంచి 64 కిలోమీటర్ల దూరం ఉంది.
పోలీసుల పటిష్ట భద్రత
భక్తుల భద్రతకు వివిధ స్థాయిల్లో సుమారు 2000 పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6వతేదీ వరకు ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్నాన ఘట్టాలవద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. తీర్థంలో కూడా గట్టి నిఘా ఉంటుందని అన్నారు. తీర్థంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలు లేకుండా అధికారులు నిఘా పెడుతున్నారు.
చారిత్రక నేపథ్యం
కృత యుగంలో నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకునేందుకు ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది గురించి బ్రహ్మ, నారదుల మధ్య జరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతారు. బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశం ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటారు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.
ఆలయ నిర్మాణ విశేషాలు
మొదటి ఆలయం శిథిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటుపడిన వారిలో ముఖ్యులు కొపనాతి కృష్ణమ్మ. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త కొపనాతి ఆదినారాయణ వీరి తండ్రి. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఈయన విరాళాలు, కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారం ముందు ఈయన శిలా విగ్రహం ఉంది. దేవాలయం రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారంగా వరండా (నడవా) మాదిరి నిర్మించి మధ్య మధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రాకారం సైతం రెండు అంతస్తుల నిర్మాణంగా ఉండి యాత్రికులు పైకి వెళ్లి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించారు.