Weather Updates: బీ అలర్ట్, మరో రెండు రోజులు వర్షాలు - ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
Weather Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో తెల్లవారుజామున వర్షం కురవగా, కొన్ని చోట్ల రాత్రిళ్లు వర్షాలు కురుస్తున్నాయి.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో తెల్లవారుజామున వర్షం కురవగా, కొన్ని చోట్ల రాత్రిళ్లు వర్షాలు కురుస్తున్నాయి. ఒకట్రెండు జిల్లాల్లో వర్ష సూచన కనిపించడం లేదు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. భారీ వర్షం కురిసే సమయంలో పాత ఇళ్లల్లో ఉండవద్దని, చెట్ల కిందకు వెళ్ల వద్దని ప్రజలకు సూచించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. విశాఖతో పాటుగా అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని కొన్ని భాగాలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో వర్షాలు నేడు పెరుగుతాయి. కాకినాడ నగరంతో పాటుగా యానం, పిఠాపురం, అన్నవరంలో కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నుంచి భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. కాకినాడ, రాజమండ్రిలో తేలికపాటి జల్లులు పడేతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
District forecast of Andhra Pradesh dated 21.06.2022 pic.twitter.com/8dLeu0NT0q
— MC Amaravati (@AmaravatiMc) June 21, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
కోస్తాంధ్రలో వర్షాలు మరింత ఎక్కువ కానుండగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. గుంటూరు, పల్నాడు, విజయవాడ, సాయంకాలానికి కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. ఈ రోజు అర్ధరాత్రి కూడ రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 21, 2022
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది.