Weather Updates: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలో అక్కడ మోస్తరు వానలు, తెలంగాణలో వాతావరణం ఇలా
Rains In Andhra Pradesh Telangana: బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అక్టోబర్ చివరి నుంచి ఈశాన్య రుతుపవనాలు బలంగా మారి వర్షాలను అందిస్తాయి.
Rains in Telangana AP: బంగాళాఖాతంలో సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రతపెరుగుతోంది. వారం రోజుల వరకు తక్కువ వర్షాలు కురవనున్నాయి. అయితే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అక్టోబర్ చివరి నుంచి ఈశాన్య రుతుపవనాలు బలంగా మారి వర్షాలను అందిస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పు ఏపీకి తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఆపై బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
సిత్రాంగ్ తుపాను అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుంటుంది. ఆపై అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు.
సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు ఒడిశా, విదర్భా మీదుగా ఉపసంహరించుకుంటున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ చివరి నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో పలు జిల్లాల్లో చినుకు కూడా లేదు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 23, 2022
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు అంతగా కురవకపోయినా చలి తీవ్రత మాత్రం రాష్ట్రంలో పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లుల పడతాయి. సాధారణ వర్షాలున్నాయని, ఎలాంటి వార్నింగ్ జారీ చేయలేదు అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు.
7 day forecast of Andhra Pradesh dated 22.10.2022 pic.twitter.com/49uBkbDVSO
— MC Amaravati (@AmaravatiMc) October 22, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఏపీపై అంతగా లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రెండు రోజులు ఒక్కడక్కడా వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వర్షాలు చాలా తక్కువగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.