Weather Latest Update: భీకర చలితో జనం గజగజ, ఈ ఏరియాలో 1.5 డిగ్రీలే - హైదరాబాద్‌లోనూ రికార్డు స్థాయిలో
అరకు లోయల్లో చాలా చల్లటి వాతావరణం కమ్ముకుంది. మన మొత్తం దక్షిణ భారత దేశంలోనే అత్యంత చల్లటి ప్రాంతం ఇది.
ఉత్తర భారత దేశాన్ని వణికిస్తున్న చలి, ఇప్పుడు నేరుగా దక్షిణ భారత దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. దీని వలన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉండనుంది. సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఏపీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్ర రూపాన్ని దాల్చనుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సాయంకాలం 4 గంటల నుంచే చలి ప్రారంభించి, తెల్లవారుజామున 10 వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చల్లటి వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రదేశాల్లో 5 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే పరిస్ధితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
అరకు లోయల్లో చాలా చల్లటి వాతావరణం కమ్ముకుంది. మన మొత్తం దక్షిణ భారత దేశంలోనే అత్యంత చల్లటి ప్రాంతం ఇది. నిన్న తమిళనాడులోని ఊటీ వైపు కూడ అంతగా నమోదుకాలేదు కానీ చింతపల్లిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. చింతపల్లి - 1.5 డిగ్రీల సెల్సియస్, హుకుంపేట - 1.5 డిగ్రీల సెల్సియస్, కుంతలం - 1.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు, ఎల్లూండి కూడ ఇలాంటి తరహాలో వాతావరణం కొనసాగనుంది. విశాఖ ఏజెన్సీనే కాదు, మారేడుమిల్లి వైపు కూడ చలి తీవ్రంగా ఉండనుంది.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ, తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. కానీ, అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 13 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 28.3 డిగ్రీలు, 12.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 8, 2023