(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నిన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (జూన్ 7) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ద్రోణి ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది. అటు నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం కూడా ఉంది. ఈ రోజు ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం జిల్లాల్లో, రేపు మరియు ఎల్లుండి అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 29 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 53 శాతంగా నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
నేడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
‘‘వేడి వాతావరణం మరింత పెరగనుంది. నిన్న మనం కోస్తాంధ్రలో 44 డిగ్రీల వరకు చూశాం. కానీ నేడు మాత్రం 45 డిగ్రీల వరకు పలు భాగాల్లో చూడగలం. నేడు ఎండలు ముఖ్యంగా ఎన్.టీ.ఆర్., ఏలూరు, ఉభయ గోదావరి, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో ఎండల వేడి విపరీతంగా ఉండనుంది. మరో వైపున రాయలసీమ జిల్లాల మీడుగా స్ట్రాటస్ మేఘాలు విస్తరిస్తు్న్నాయి. దీని వలన నేడు సాయంకాలం రాత్రి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పలు భాగాల్లో వర్షాలు, పిడుగులు చూడగలము. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడ ఉపశమనం పలు భాగాల్లో లభించనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.