Weather Latest Update: నేడు ఈ ప్రాంతాల్లో అతి స్వల్ప వర్షం, తెలంగాణలో చలి బెంబేలు - ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్!
చలి బాగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అందులో పేర్కొంది.
స్వల్ప వర్షాలు పడే అవకాశం
ఏపీలోనూ రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి బాగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విండ్ కన్వర్జన్స్ (గాలుల సంగమం) కారణంగా వైజాగ్ - శ్రీకాకుళం తీరం వెంబడి ఏర్పడుతున్న భారీ మేఘాలు నేరుగా కొనసీమ - కాకినాడ, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి విస్తరించాయి. దీని వలన కొద్ది పాటి లేదా కొద్దిసేపు వర్షాలు పడనుంది. మధ్యాహ్నం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల స్వల్ప వర్షాలుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు.
రేపు ఈ మూడు జిల్లాలతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు, ఎల్లుండి అదనంగా నిజామాబాద్, జగిత్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.