నేడు ఈ జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో వాతావరణం పొడిగానే: IMD
ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి.
ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములతో కూడిన జల్లులు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల.. రాయలసీమలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఉరుములతో కూడా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంబంవించే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 2015 లో నెల్లూరు జిల్లాలో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈసారి అలాంటి వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నాలుగు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
అల్పపీడనం ప్రభావంతో నిన్నటి వరకూ కొన్ని జిల్లాల్లో వర్ష సూచన ఉంది. కానీ, శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొని ఉంటుందని పేర్కొంది. మరోవైపు, హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తున్నాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. నగరంలో కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 27 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు దిశ నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 3, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మనకు పల్నాడు నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
చెన్నై కి దగ్గరగా ఉన్న తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. చెన్నైలో వర్షాలు తగ్గి నేరుగా ఏపీలోని రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళూరుపేట - గూడూరు వైపు అల్పపీడనం ప్రభావం చూపుతోంది. మరోవైపు ఒంగోలు నుంచి దక్షిణ భాగంలో ఉన్న కుప్పం వరకు తేలికపాటి వర్షాలు రాత్రి వరకూ పడుతునే ఉంటాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది.