Weather Updates: తెలంగాణలో ఈ జిల్లాలకు అలర్ట్! ఠారెత్తనున్న ఎండలు - ఏపీలో ఈ ప్రాంతాల్లో అధికంగా వేడి
AP Telangana Weather News: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎండ 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకుతోంది.
Rain in Telangana Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రతిరోజూ అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉత్తర కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉండగా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఉపరితల ద్రోణి ప్రభావం, ట్రోపో వాతావరణంలో గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఏప్రిల్ 30 వరకు జల్లులు అక్కడక్కడ కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రికి వర్షాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది.
ఏపీ వెదర్ మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం పార్వతీపురం వైపు మొదలైన భారీ పిడుగులు, వర్షాలు విజయనగరం జిల్లా సలూరు వైపుగా కదిలాయి. విజయనగరం జిల్లాలోని పలు భాగలతో పాటుగా పార్వతీపురం మణ్యం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు పడ్డాయి. ‘‘ఇవి ఎండాకాలం వర్షాలు. అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. మధ్యాహ్నం సమయం ఉన్న వేడి, కాస్తంత తేమ గాలుల వల్ల ఈ వర్షాలు కురుస్తాయి. మరో వైపున విశాఖ నగరంలో రాత్రి ఎక్కడ వర్షాలు ఉండవు. రాత్రంతా ఉక్కపోతగా, వేడిగా ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.
తెలంగాణలో ఇలా Telangana Weather Updates
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువయ్యాయి. కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం, శ్రీకాకుళం, విజయనరం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను తాకుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలను తాకుతోంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుంది. కొన్ని చోట్ల 46 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.