Weather Updates: అసని తుపాను హెచ్చరిక! ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్! గాలులు కూడా తీవ్రంగానే
Asani Cyclone Effect; విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Asani Cyclone Effect Latest News: అసని తుపాను ఎఫెక్ట్ ఏపీపై కాస్త ఎక్కువగానే పడనుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆసాని తుఫాను కాస్తంత బలపడి మెల్లగా కాకినాడ - విశాఖపట్నం వైపుగా అడుగులు వేస్తోంది. అయితే, విశాఖ - కాకినాడ వైపుగా తుపాన్లు రావడం చాలా అరుదు. గత 200 సంవత్సరాల్లో మే నెలలో వైజాగ్ - కాకినాడ బెల్ట్ వైపుగా కేవలం 3 తుపాన్లు మాత్రమే వచ్చాయి.
అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘మే 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలో ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. పెను గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అత్యధికంగా 60 కిలో మీటర్ల వేగంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి వీస్తాయి. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక ఇస్తున్నాం’’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Weather briefing dated 9th May 2022 on Severe cyclone "ASANI" pic.twitter.com/nmHkyHyGul
— MC Amaravati (@AmaravatiMc) May 9, 2022
10వ తేదీ నుంచి 12 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ నగరం (ముఖ్యంగా), విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ నుంచి కాకినాడ దాక అతిభారీ, తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఈదురు గాలులు కూడ 10, 11వ తేదీన తీవ్రంగా ఉంటాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి.
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం కలగనుందని వెల్లడించింది. ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇంకొన్ని ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చని అంచనా వేశారు.