Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణపై సైతం అల్పపీడనం ప్రభావం
AP Rains: కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Weather Updates In AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణలపై ఉంది. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నిన్నటి మాదిరిగానే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు, ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యాకారులను సైతం వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు విశాఖపట్నం సహా తీరప్రాంతాల్లో నవంబర్ 13 వరకు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.
Also Read: సీఎం జగన్ బిచ్చమెత్తుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి... సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఏపీ మంత్రి కౌంటర్
తిరుమల ఘాట్ రోడ్డులో ఇదివరకే వాహనాల రాకపోకలను సైతం నిలిపివేయగా.. కేవలం నడక దారిన మెట్ల మార్గంలో శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేశారు.
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు ముప్పు పొంచి ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. విశాఖపట్నం నగరంలో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైజాగ్ సిటీలో ప్రాంతాలు జలమయం అయ్యే ఛాన్స్ ఉంది. తుఫాను వేళ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో చాలా ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యామ్ కు వరద నీరు పోటెత్తుతోంది. భాకరాపేట నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను అధికారులు అనుమతించడం లేదు.
Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్ !
తెలంగాణలో ఇలా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం తెలంగాణపై ఉండనుంది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో ధాన్యం తడిచే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు