Weather Updates: రెయిన్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. జవాద్ తుపానుగా మారే ఛాన్స్!
అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి డిసెంబరు 2వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో నవంబర్ 30న అల్పపీడనం ఏర్పడింది. ఇది అండమాన్ సముద్ర తీరం వైపు కదులుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి డిసెంబరు 2వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతరం ఇది మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 3వ తేదీకల్లా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి డిసెంబర్ 4వ తేదీ నాటికి అల్పపీడనం చేరుతుంది. శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం..
ఉత్తర కోస్తాంధ్ర మరియు యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలోతేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు మరో రెండు రోజులవరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంట అలలు ఎగసిపడి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: Nellore Floods: నెల్లూరు జిల్లాలో వాన విచిత్రాలు... పాతాళ గంగ పైపైకి
Government of India
— MC Amaravati (@AmaravatiMc) November 30, 2021
India Meteorological Department
Meteorological centre Amaravati
Weather briefing for Andhra Pradesh in Telugu Dated:- 30.11.2021. pic.twitter.com/tgUoZ0iCue
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధికంగా నష్టపోయిన ప్రాంతమైన రాయలసీమను మరో మూడు రోజులు వర్షాలు ముంచెత్తనున్నాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనం వాయువ్యదిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా తీరాన్ని రెండు రోజుల్లో తాకనుంది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసే చోట అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి.
తెలంగాణలో ఇలా..
వరుస అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లగా ఉంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. డిసెంబర్ 3, 4 తేదీల్లోనూ వాతావరణం పొడిగా ఉండనుందని అధికారులు అంచనా వేశారు.
Also Read: Nellore Rains: దయచేసి నెల్లూరు వైపు రావొద్దు.. వచ్చి ఇబ్బందులు పడొద్దు.. అధికారుల సూచనలు