Somu Veerraju : స్పీకర్ ఓ దద్దమ్మ, కనీసం ఓ ప్రాజెక్టుకు రూ.50 కోట్లు తెచ్చుకోలేకపోయారు - సోము వీర్రాజు
Bjp Somu Veerraju : స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కనీసం రూ.100 కోట్లు తెచ్చుకోలని దద్దమ్మ స్పీకర్ అని మండిపడ్డారు.
Bjp Somu Veerraju : ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్రలో బీజేపీ జనపోరు యాత్ర నిర్వహిస్తున్నారు. మూడో రోజు పర్యటనలో సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండడానికి కారకులు ఎవరని ప్రశ్నించారు. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒకేలా వ్యవహరించారని మండిపడ్డారు. స్పీకర్ పై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యత గల పదవిలో ఉండి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. స్పీకర్ ఒక దద్దమ్మ నాలిక మడతెసి మాట్లాడతారా అని ఆరోపించారు. మాడుగులకు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండడానికి కారకులెవరని స్పీకర్ ను ప్రశ్నించారు.
స్పీకర్ జాగ్రత్తగా మాట్లాడు!
స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏం మాట్లాడుతున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. వంశధారలో 5 వేల మంది నిర్వాసితులను కాపాడలేకపోయిన దద్దమ్మ అని విమర్శించారు. ఒక ప్రాజెక్టుకు రూ.50 కోట్లు తెచ్చుకోలేని ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కోటి మంది బియ్యానికి రూ.25 వేల కోట్లు ఇచ్చారన్నారు. సీఎం జగన్ ఎన్నో వందల కోట్లతో బియ్యం సరఫరా వ్యాన్లు కొన్నారన్నారు. ఆ వ్యాన్లు కొన్న డబ్బులో వంద కోట్లు పెట్టి మాడుగుల్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎంతో మంది రైతులు బాగుపడేవారన్నారు. వంద కోట్ల రూపాయలతో ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఒక్క పంటలోనే వంద కోట్లు వచ్చేస్తాయన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మాడుగుల మరో కోనసీమ అవుతుందన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బు కేటాయిస్తున్నారని వైసీపీ చెప్పుకుంటుందన్నారు. కానీ కేంద్రం ఇచ్చే డబ్బునే సంక్షేమ పథకాలకు వాడుతున్నారన్నారు. రేషన్ బియ్యం, మధ్యాహ్న భోజనం, నాడు నేడు పథకానికి కూడా ప్రధాని మోదీ డబ్బులు ఇస్తున్నారన్నారు.
డబ్బుస్తే పరిపాలించడానికి వచ్చావా?
"సీఎం జగన్ 9 పథకాలు ఇస్తే ప్రధాని మోదీ 100 పథకాలు అమలుచేస్తు్న్నారు. మంత్రులకు ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా డిబేట్ రావొచ్చు. డబ్బు ఇస్తే పరిపాలించడానికి వైసీపీ అధికారంలోకి వచ్చిందా?. ఓ బుర్ర లేని స్పీకర్ మేం డబ్బు ఇస్తే పాలించడానికి అధికారంలోకి వచ్చావా? కనీసం రోడ్డు కూడా వేయించుకులేని పరిస్థితిల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇసుక, మట్టి కూడా అమ్మేసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి కుటుంబ పార్టీలు అవసరంలేదు. రాష్ట్రానికి అభివృద్ధి చేసేది మోదీ ప్రభుత్వమే. 2024లో ఏపీలో మోదీ ప్రభుత్వం వస్తుంది." అని సోము వీర్రాజు అన్నారు.