Pawan Kalyan : దెబ్బతిన్న పులి లాంటోడ్ని అవినీతి చేసేవాళ్ల అంతం చూస్తా- పవన్ కల్యాణ్
Pawan Kalyan : వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా మాట్లాడితే మాట్లాడండి ఎరా అంటే ఎరా అనే సమాధానం వస్తుందన్నారు.

Pawan Kalyan : ఒక్క జగనన్న కాలనీ దోపిడియే రూ.12 వేల కోట్లు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుందన్నారు. జగనన్న కాలనీల దోపిడీపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తానన్నారు. యువతకు పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చానన్న ఆయన... గుంకలాంకు వచ్చే 14 కి.మీలు దారి పొడుగునా కమండోల్లా యువత పరుగులు పెట్టారన్నారు. సొంత జేబుల్లో నుంచో బొత్స జోబుల్లో నుంచో మనకు డబ్బులు ఇవ్వడం లేదని, టాక్స్ రూపేణా మనం కడుతున్న డబ్బును వీళ్లు దోచుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీగా ఇస్తామన్నారు. 2024లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి, జనసేన రావాలి అనే నినాదం ఇచ్చారు పవన్. ఎవరైనా దోపిడీకి పాల్పడితే చొక్కాలు పట్టుకుని ప్రశ్నించాలన్నారు.
దెబ్బతిన్న పులి లాంటోడ్ని
"నాకు డబ్బు మీద ఆశ లేదు. నేను విశాఖలోనే సినిమా కళ నేర్చుకున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై నాకు అవగాహన ఉంది. ఏ పార్టీ ఈ దోపిడీని ప్రశ్నించడం లేదు ఒక్క జనసేన తప్ప. జనసేనను నమ్మండి గూండాలను ప్రశ్నిస్తా. ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరిస్తాం. ఓట్లు వస్తాయో రావో తెలియదు కానీ మేము నామినేషన్లు వేస్తాం. మా నాయకుల నామినేషన్లు ఆపితే తాట తీస్తా కాళ్లు కీళ్లు విరిచి తాట తీస్తా. గడప గడపకు వైసీపీ నాయకులు వస్తే మాకేం చేశారు అని అడగండి. మీరంతా యువత దేశ నాయకుల వారసులుగా నిలదీయండి. వైసీపీకి విజయనగరం నుంచి ఒకటే వార్నింగ్ మర్యాదగా మాట్లాడితే మాట్లాడండి ఎరా అంటే ఎరా అనే సమాధానం వస్తుంది. ఓడిపోయిన వాడ్ని, గాయపడ్డ వాడ్ని దెబ్బ తిన్న పులి లాంటోడ్ని అవినీతి చేసేవాళ్ల అంతం చూస్తా." -పవన్ కల్యాణ్
సంక్షేమ పథకాలు తొలగించం
జనసేన అధికారంలోకి వస్తే ఏ సంక్షేమ పథకాలు నిలిపివేయమని పవన్ స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ కోరారు. వైసీపీ నేతల్లా తాను ప్రధానమంత్రికి చాడీలు చెప్పనన్నారు. రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజల్ని వైసీపీ మోసం చేస్తుందని విమర్శించారు. బంగారు భవిష్యత్ కోసం జనసేనను గెలిపించాలన్నారు. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనపై పోరాటం కోసం వినియోగించాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు తాను సిద్ధమన్నారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుందన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దామని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడాలని పవన్ సూచించారు. కేసులు పెడితే తాను జైలుకు వస్తానని జనసేనాని స్పష్టం చేశారు.
జనసేన క్యాంపెయిన్
గంకులాంలో 397 ఎకరాల్లో జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇది రెండో అతిపెద్దది. 2020 డిసెంబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నేటికీ ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. విజయనగరం నగరానికి దూరంగా ఉండటం. సరైన సదుపాయాలు లేకపోవడం, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, ప్రభుత్వం ఇచ్చే సాయం చాలకపోవడం, బిల్లులు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో అక్కడ పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే గుంకలాంలో ఇళ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అలసత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్ అక్కడ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో పరిస్థితులపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుంది. ఈ కాలనీల్లో పరిస్థితులను వెలుగులోకి తెస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

