Viveka Murder Case: వివేకా హత్య కేసులో అల్లుడిని సీబీఐ ఎందుకు విచారించడం లేదు: ఎంపీ అవినాష్ రెడ్డి
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా అల్లుడిని ఎందుకు విచారించట్లేదంటూ ప్రశ్నించారు.
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారుల విచారణ తీరు సరిగ్గా లేదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగ చూస్తూ.. ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు. అధికారుల తీరు గురించి సీబీఐ పెద్దలకు కూడా తెలియజేశామన్నారు. పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అన్నారు. తాము లేవనెత్తిన కీలక అంశాలపై వారు స్పందించడం లేదని.. వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా పట్టించుకోవడం లేదని వివరించారు. ఆయన చనిపోయినప్పుడు తానే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చానని.. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంటే గంట ముందుగానే విషయం తెలిసినా ఆయన అల్లుడు పోలీసులకు ఈ విషయం చెప్పలేదని అన్నారు.
వైఎస్ వివేకా రాసిన లేఖను, ఫోన్ ను దాచిపెట్టాలని ఆయన అల్లుడు చెప్పారని అన్నారు. సమాచారం దాచినా వివేకా అల్లుడిని విచారించడంలేదని చెప్పారు. కావాలనే తమను దోషులుగా చూపాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దస్తగిరి వాంగ్మూలాన్ని, వాచ్ మెన్ రంగన్న చెప్పిన విషయాలను కూడా సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారని ఆరోపించారు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారన్నారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని కోరారు. వ్యక్తులు లక్ష్యంగా విచారణ చేయడం దారుణం అన్నారు. ఎలాంటి విచారణను అయినా ఎదుర్కునేందుకు తాము సిద్ధం అన్నారు. వివేకా హత్య కేసులో నిజం గెలవాలని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తమ మంచితనం నిలబెట్టుకుంటామని, నిర్దోషిత్వం నిరూపించుకుంటామని చెప్పారు.
తాజాగా అవినాష్ రెడ్డి అనుచరుడి అరెస్ట్..
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి, అతడి తండ్రి జయప్రకాశ్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. పులివెందుల నుంచి కడప జైలు గెస్ట్ హౌస్‌కు ఉదయ్‌ను తీసుకెళ్లి ప్రశ్నిస్తోంది. సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి సీబీఐ అధికారులు ఉదయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, ఆయన న్యాయవాది సమక్షంలోనే అరెస్టు చేశారు.
ఉదయ్ అరెస్టు మెమోనూ అతని కుటుంబ సభ్యులకు సీబీఐ అప్పగించింది. తర్వాత కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఉదయ్ కుమార్ రెడ్డిని తరలించారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉదయ్‌ను హాజరుపరిచే అవకాశం ఉంది. తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో ఉదయ్‌కుమార్ రెడ్డి పని చేస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై గతంలో కడప కోర్టులో ప్రైవేటు కేసు వేశారు ఈయన. ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామ్ సింగ్‌పై రిమ్స్ పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈ నెల 30లోపు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఈ రోజు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.