Viveka Murder Case: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి - సుప్రీంలో సీబీఐ అఫిడవిట్
వివేకానంద రెడ్డి హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీతా రెడ్డి సవాలు చేశారని కూడా సీబీఐ అఫిడవిట్ లో ప్రస్తావించింది. వివేకానంద రెడ్డి హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయాల్లో విభేదాల కారణంగానే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని సీబీఐ అఫిడవిట్ లో స్పష్టం చేసింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని మరోసారి సీబీఐ పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించారని గుర్తు చేసింది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని షర్మిల లేదా విజయమ్మల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని సీబీఐ వివరించింది.
ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ గతంలో సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోనే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్యకు దాడి చేసిన పరిణామాలు దాని అనంతరం, సాక్షాధారాల చెరిపివేతలో నిందితులు వ్యవహరించిన తీరును గురించి సీబీఐ వివరించింది.
వివేకా హత్య అనంతరం ఆయన గుండెపోటు వల్ల చనిపోయారంటూ కట్టుకథ అల్లారని సీబీఐ అఫిడవిట్ లో వెల్లడించింది. అవినాష్ రెడ్డి పాత్రపైన తాము ఇంకా దర్యాప్తు చేయాలని తెలిపింది. వివేకానంద రెడ్డి వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్‌కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడని వివరించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది.