YSR Vahana Mitra Money: ఏపీలో వారి ఖాతాల్లో రూ.10వేలు జమ చేసిన సీఎం జగన్, దేశంలో ఎక్కడా లేని పథకం
YSR Vahana Mitra Money: విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు నాలుగో విడత నగదు రూ.10 వేలను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
YSR Vahana Mitra: వైఎస్సార్ వాహనమిత్ర పథకం 2022–23 లబ్ధిదారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. లబ్ధిదారులైన డ్రైవర్ల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో వాహన మిత్ర (YSR Vahana Mitra) చెక్కులను కొందరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగో విడతగా వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
నాలుగో విడత నగదు జమ..
2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా దాదాపు 2,61,516 మంది అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో నాలుగో విడతలో రూ.261.51 కోట్ల వరకు జమ చేయనున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్ఆర్ వాహనమిత్ర (YSR Vahana Mitra) పథకం కింద ఆర్థిక సహాయం చేశారు. ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది.
విశాఖ: వైయస్ఆర్ వాహనమిత్ర సాయం పంపిణీ.. సీఎం శ్రీ వైయస్ జగన్ చేతులమీదుగా ప్రారంభం. వరుసగా నాలుగో ఏడాది డ్రైవరన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం. 2,61,516 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 261.52 కోట్లు జమ.
— YSR Congress Party (@YSRCParty) July 15, 2022
Watch live: https://t.co/cdOCrLQ3dR#YSRVahanaMitra #CMYSJagan
దేశంలో ఎక్కడా లేని పథకం..
గత మూడేళ్లుగా డ్రైవర్ల ఖాతాల్లో నగదు సాయం జమ చేసింది ఏపీ ప్రభుత్వం నేడు నాలుగో విడత వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ నగదు అర్హులైన డ్రైవర్ల ఖాతాల్లో జమ కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం మరోసారి గుర్తుచేశారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందచేశామని, అన్ని వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు ఈ డ్రైవర్లు రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్నారని, ఏ వివక్షా లేకుండా లబ్దిదారులకు సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. కులం, మతం, వర్గం అనే వ్యత్యాసం లేకుండా తమ మూడేళ్ల పాలనతో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా నాలుగో విడతతో కలిపి లబ్ధిదారులకు మొత్తం రూ.1,026 కోట్లను పంపిణీ చేశామన్నారు.
నేటి ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు సీఎం చేరుకున్నారు. వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొని అర్హులైన డ్రైవర్లకు పది వేల సహాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అధికారులతో వరదపై సమీక్షించనున్నారు.