YSRCP: విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స- కీలక నిర్ణయం తీసుకున్న జగన్
Visakha MLC By-Elections: విశాఖలో వంశీకృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో వైసీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా మాజి మంత్రినే అక్కడ బరిలోకి దింపుతోంది.
Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నకల ముందు వరకు వైసీపీలో ఉన్న వంశీ కృష్ణ రాజీనామాతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉపఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వంశీ కృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో జాయిన అయి వంశీపై అనర్హత వేటు పడింది. దీంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
మూడు నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆయనపై వేటు పడే వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. వైసీపీకీ రాజీనామా చేసి అనర్హతవేటుకు గురైన వంశీ ఇప్పుడు జనసేన ఎమ్మల్యేగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో సీటు గెలవడం ఇరు పక్షాలకు అనివార్యంగా మారింది.
విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యం ఉంది. మొత్తం 841 ఓటర్లు ఉంటే అందులో వైసీపీకి చెందిన వాళ్లే 615 మంది ఉన్నారు. టీడీపీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో అంటే 2020లో జరిగిన ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. అయినా చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ అభిమానులు, నేతలు పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ లెక్కలు గమనిస్తే వైసీపీ గెలవడం అంత కష్టమేమీ కాదు. కానీ ఆ పార్టీ ప్రతిపక్షం ఉండటంతో గెలుపు అంత ఈజీ కాదన్నది మరో వైదన ఉంది.
మారిన రాజకీయ పరిస్థితులతో చాలా మార్పులు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీకి ఇప్పటికే విశాఖ కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వాళ్లంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు టీడీపీ గూటికి చేరారు. ఇంకా ఎన్నికలు చాలా సమయం ఉన్నందున మరికొందరు అదే బాట పడతారని వైసీపీ ఆలోచిస్తోంది. ఇంకొందరు ఆయా పార్టీల్లో చేరకోపయినా ఓటు తమకే వేస్తారనే గ్యారంటీ లేదని భావిస్తోంది. అందుకే ముందుగా క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేసింది.
వీటికి తోడు అందర్నీ కలుపుకొని వెళ్లి బలంగా ఉన్న నాయకుడిని అభ్యర్థిగా నిలబెడితే సగం విజయం సాధించినట్టేనని భావించింది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉన్న అతి పెద్ద లీడర్ అయిన బొత్స సత్యనారాయణను రంగంలోకి దించింది. ఆయన అయితే స్థానిక పరిచయాలు, నేతలతో ఉన్న సంబంధాలు ఇక్కడ కీలకంగా మారతాయని ప్లాన్ చేసింది. అందరితో ఆలోచించి బొత్స పేరును ఇవాళ జగన్ ఖరారు చేశారు. అర్థికంగా కూడా బొత్స అంశం కలిసి వస్తుందని పార్టీ ఆలోచన.
కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న పరిశీలన జరుగుతుంది. ఇంత వరకు కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇంతకీ ఈ సీటు జనసేనకు కేటాయిస్తార లేకుంటే టీడీపీకి దక్కుతుందా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా ఉన్న వంశీ జనసేనలోకి వెళ్లారు... కానీ స్థానికంగా బలంగా ఉన్న పార్టీ మాత్రం టీడీపీ వైసీపీ. దీంతో సీటు ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.