YS Jagan Vizag Tour: రేపు ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించనున్న సీఎం జగన్ - పర్యటన పూర్తి షెడ్యూల్
YS Jagan Vizag Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 16న) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు.
Infosys Development centre:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 16న) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ తో పాటు ఫార్మాసిటీలో నిర్మించిన యూనిట్ను ప్రారంభించనున్నారు.
ఇన్ఫోసిస్ సంస్థ విశాఖపట్నంలో ఒక కొత్త డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్ ను భవిష్యత్ లో మరింత విస్తరించాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది. ఇది సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఏర్పాటుచేశారు.
అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..
యూజియా స్టెరిల్స్ ప్రెవేట్ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ
ఫార్మా, బయెటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని సమాచారం.
లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రేవేట్ లిమిటెడ్
యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించింది. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఈ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 600 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్
అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్ ల్యాబ్స్ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దీంతోపాటు లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా భూమి పూజ నిర్వహించనున్నారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.