Gajapathinagaram Assembly Constituency: గజపతినగరంలో టగ్ ఆఫ్ వార్- టీడీపీ సిక్స్ కొడుతుందా? వైసీపీకి రెండో ఛాన్స్ ఉంటుందా?
Vizianagaram News: అధికార ప్రతిపక్షాల వ్యూహప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ బాగా కనిపిస్తున్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. ఇక్కడ కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవాలని అధికార ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయి.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ మరో ఆరు రోజుల్లో జరగనుంది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. దీంతో గెలుపు కోసం పార్టీలన్నీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలపై కూటమి ప్రత్యేక దృష్టి పెట్టింది. కచ్చితంగా ఆ జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం, పోల్‌మేనేజ్‌మెంట్ వరకు అన్నీంటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు అధికార పార్టీ కూడా ప్రత్యర్థులకు ఆయా జిల్లాలు చిక్కకుండా ప్రతి వ్యూహాలను రచిస్తోంది.
ఇలా అధికార ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ బాగా కనిపిస్తున్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడి కనుసన్నల్లో ఉండే జిల్లాలో విజయం సాధించాలని పూర్వవైభవం దక్కించుకోవాలని టీడీపీ ప్రత్యేక ప్లాన్‌తో వెళ్తున్నట్టు ఆ జిల్లా నాయకులు చెబుతున్నారు. జిల్లాలో మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజక వర్గాలపై ఆ పార్టీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాంటి వాటిలో ఒకటి గజపతి నగరం.
ఈసారి గజపతినగరంలో కచ్చితంగా జెండా ఎగరేయాలన్న కసితో పార్టీ పని చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ తరుఫున బొత్స అప్పలనర్సయ్య ఇక్కడ పోటీలో ఉన్నారు. ఈయనకు పోటీగా ఆర్థిక, అంగబలం ఉన్న వ్యక్తిని టీడీపీ పోటీలో దింపింది. అప్పల నర్సయ్యపై కూటమి తరపున టీడీపీ నేత కొండపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఐదు సార్లు విజయ బావుటా ఎగరేసిన ఈ నియోజకవర్గంలో ఆరోసారి విజయం సాధించి అధినేతకు గిఫ్టుగా ఇస్తానంటున్నారు శ్రీనివాస్.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అప్పలనర్సయ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేప్టటిన పనులు ప్రజలకు చెబుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసిన ఘనత తమకే దక్కిందని... అవి కొనసాగాలంటే తమను గెలిపించాలని కోరుతున్నారు. మంత్రి బొత్స సత్సనారాయణ రిలేటివ్ కావడంతో అది బాగా కలిసి వస్తుందని నమ్ముతున్నారు. సహజంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఒక ఎత్తు అయితే స్థానికంగా ఆయనపై నేతలు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. చాలా మంది ప్రచారానికి కూడా రావడం లేదని మరికొందరు పార్టీ మారిపోతున్నారని చెబుతున్నారు.
కూటమి తరఫున పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌పై పార్టీలో మొదట్లో ఉన్న నెగటివ్ పోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లడంలో ఆయన విజయం సాధించారని ఇప్పుడు నియోజకవర్గంలో విజయానికి ఆయనకు ఇదే ప్లస్ అవుతుందని అంటున్నారు. బొత్స అప్పలనర్సయ్యపై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని కచ్చితంగా గజపతినగరంలో జెండా ఎగరేస్తామని విజయనగరం జిల్లాలో గెలిచే తొలి సీటు ఇదే అవుతందని అంటున్నారు ఇక్కడి టీడీపీ నేతలు.
టీడీపీ ముందు నుంచి ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయని... దీనికి తోడు శ్రీనివాస్ బ్యాక్‌గ్రౌండ్ తెలిసిన యువత పాజిటివ్‌గా స్పందిస్తున్నారని అంటున్నారు. ఈ రెండింటినే ప్రచార అస్త్రంగా చేసుకొని శ్రీనివాస్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఐదేళ్లలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సమయంలో గజపతి నగరంలో వైసీపీ నుంచి వలసలు రావడం కూడా తమను విజయానికి చేరువ చేస్తోందని లోకల్ లీడర్లు చెప్పుకుంటున్న మాట.