Visakha News: విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం - డబ్బుల కోసం చిన్నారి జీవితంతో చెలగాటం!
Visakha News: విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగి కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. బాబు కాసేపు బతికే ఉన్నాడని, చనిపోయాడని కాసేపు చెబుతూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.
Visakha News: విశాఖ జగదాంబ జంక్షన్ లో ఉన్న మెడికవర్ ఆస్పత్రి సిబ్బంది అరాచకం సృష్టిస్తున్నారు. డబ్బులు కోసం బాబు బతికే ఉన్నాడని కాసేపు, చనిపోయాడని కాసేపు చెబుతూ... తల్లిదండ్రులు, బంధువులకు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు లక్షల డబ్బు కట్టాలని తీవ్రంగా వేధిస్తున్నారు.
అనకాపల్లి మండలం పాపయ్యపాలెం గ్రామానికి చెందిన 11 రోజుల శిశువుకు గుండెలో రంధ్ర ఉన్నట్లు గుర్తించారు. ఈక్రమంలోనే తల్లిదండ్రులు బాబును తీసుకొని విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే బాబు ఆపరేషన్ కి ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది చెప్పగా.. ఇప్పటికే తల్లిదండ్రులు నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. ఈక్రమంలోనే చికిత్స చేస్తున్న వైద్యులు.. ఈరోజు ఉదయం బాబుకు ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయినట్లు తెలిపారు. మిగిలిన బిల్లు కట్టి మృతదేహం తీసుకెళ్లాలని సూచించారు.
డబ్బులు చెల్లిస్తేనే బాబు మృతదేహాన్ని అందజేస్తామని వివరించారు. దీంతో బంధువులతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనకు దిగారు. ఆస్పత్రి బయట కూర్చొని ఆందోళన చేపట్టారు. బాబు మృతదేహాన్ని అప్పగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు గట్టిగా అడిగే సరికి శిశువు బతికే ఉన్నాడని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు.. బాబు బతికే ఉన్నాడా, చనిపోయాడా అని తెలియక విలపిస్తున్నారు. బాబును ఓసారి చూపించాలంటూ వైద్య సిబ్బందిని ప్రాధేయపడుతున్నారు.