Seediri Appalaraju: ఆ దాడులు మర్చిపోయే ఇలా మాట్లాడుతున్నారా? మంత్రి అప్పల్రాజుకు వార్నింగ్
మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖపై మంత్రి అప్పలరాజు దుష్పచారం మానుకోవాలన్నారు. మొదటి లేఖ మాదిరిగానే ఈసారి విడుదలైన లేఖ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఏపీ పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును టార్గెట్ చేస్తూ మావోయిస్టుల పేరిట మరో లేఖ విడుదలైంది. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో బుధవారం హల్ చల్ అయింది. గతంలో ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల కాగా ఈసారి విప్లవ యువజన సంఘం (వైవీఎస్) కార్యదర్శి అశోక్ పేరిట లేఖ వచ్చింది. మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖపై మంత్రి అప్పలరాజు దుష్పచారం మానుకోవాలన్నారు. మొదటి లేఖ మాదిరిగానే ఈసారి విడుదలైన లేఖ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మంత్రికి వత్తాసు పలుకుతున్న ఓ రెండు పత్రికల యాజమాన్యం పద్ధతిని మార్చుకోవాలని, మావోయిస్టులను ప్రశ్నించడంపై కూడా లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు ప్రజాసంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం మంత్రికి లోపాయికారిగా ఇస్తున్న సలహాలు, సూచనలు, సహకారాలు మానుకోవాలని హితవు పలికారు. ఇంకా అందులో ఉన్న సమాచారం మేరకు ప్రజలారా, విప్లవాభిమానులారా, అభిమానులారా మంత్రి సీదిరి అప్పలరాజు, ఇతని అనుయాయులు చేస్తున్న భూదందాని బయటపెట్టి వారు అక్రమంగా ఆక్రమించిన రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుంచి తక్షణమే వైదొలగాలనీ, ఆ భూములు ఈ ప్రాంత పేద ప్రజలకే చెందాలని డిమాండ్ చేశారు.
‘చంద్రబాబు, ఎర్రన్నాయుడిపై దాడులు మర్చిపోయారా?’
ప్రజల తరపున మాట్లాడిన మావోయిస్టు పార్టీ పైన, ఆ పార్టీ ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీపైన మంత్రి అప్పలరాజు సోషల్ మీడియాలో విరుచుకుపడడం, పార్టీ పంపిన లెటర్ ను ప్రచారం చేసిన వారిపై చర్యలు ఉంటాయని భయపెట్టడం అతని దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ఠ అని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో దాడి విషయం, ఇదే జిల్లాలో ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడుపైన దాడి విషయం, హోం మంత్రి మాధవ రెడ్డిని అంతమొందించిన విషయం తెలిసే మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో అని హెచ్చరించారు. దోపిడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది వైసీపీ లేదా తెలుగుదేశం ఏదైనా మావోయిస్టు పార్టీ ముందు ఒక్కటే అని గుర్తుంచుకోవాలన్నారు.
ఇంకా ఆ లేఖలో ఏముందంటే.. ‘‘ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటాయో అక్కడ మావోయిస్టు పార్టీ పేదప్రజల తరఫున నిలబడి మాట్లాడుతుందన్నది జగమెరిగిన సత్యం. మావోయిస్టు పార్టీ సభ్యులు ప్రజల కోసమే జీవిస్తారు. ప్రజల కోసమే మరణిస్తారు. ఇదే నడుస్తున్న చరిత్ర. మహాత్తర త్యాగాలబాటలో పయనిస్తున్న మావోయిస్టు పార్టీపై మంత్రి, వారి అనుచరులు ఇక్కడ మావోయిస్టు పార్టీ ప్రజా సంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం (పోతనపల్లి అరుణ, కోదండం, పత్తిరి దానేసు, కొర్రయి నీలకంఠం) లోపాయికారిగా ఇస్తున్నసూచనలు, సలహాలు, సహకారంతో చాలా దురహంకారపూరితంగా నోటికి వచ్చినట్లు వాగడం, అధికార మదంతో విర్రవీగడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
వీరి అకృత్యాలకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని మరచిపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే దుష్ట చతుష్టయం వీరి వీరి పద్ధతులు మార్చుకోవాలని, లేకపోతే ప్రజల కోపానికి గురికాక తప్పరని తెలియజేస్తున్నాం. వీరి వీరి దోపిడీ దౌర్జన్యాలకు ముగింపు పలికి ప్రజలకు క్షమాపణ చెప్తే చరిత్ర క్షమిస్తుంది. లేకపోతే చరిత్రలో ప్రజా శత్రువులకు పట్టిన గతే వీరికీ పట్టక మానదు. అప్పుడు వీరిని ఆదుకోడానికి ఎవ్వరూ ఉండరు. ఇదే చారిత్రక సత్యం. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదని గుర్తించడం మంచిది. అలాగే ప్రజలకోసం పనిచేస్తున్న మావోయిస్టు పార్టీపై వీరు పన్నుతున్న కుతంత్రాలను, చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించవలసినదిగా ప్రజలను కోరుతున్నాం’’ అంటూ విప్లవ యువజన సంఘం ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ అశోక్, కార్యదర్శి పేరిట రెండు పేజీలు లేఖను విడుదల చేశారు.