YV Subbareddy: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ తలెత్తుకుని బతికేలా చేసింది రాజ్యాంగం: వైవీ సుబ్బారెడ్డి
YV Subbareddy: భారతదేశం ఇప్పటికీ పటిష్టంగా ఉండేందుకు రాజ్యాంగ నిర్మాతలే కారణం అని టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కర్త అంబేడ్కర్ కు దేశమంతా రుణపడి ఉంటుందన్నారు.
YV Subbareddy: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారత దేశం విరాజిల్లడానికి దూర దృష్టితో తయారు చేసిన రాజ్యాంగమే కారణమని టీటీడీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాతల గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. శనివారం ఉదయం విశాఖపట్నం జిల్లా ఇసుకతోటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలకు సమాన ఫలాలు అందేలా మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశ ప్రజలందరికీ పండుగ రోజుగా అభివర్ణించారు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ తలెత్తుకుని బతికేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ కు దేశమంతా రుణపడి ఉంటుందన్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
విద్య, వైద్య రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, దీని కోసం నాడు - నేడు, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు విదేశీ విద్యలో పోటీ పడేలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మాజీ సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి సుబ్బారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద కాళీ మాత టెంపుల్ నుంచి పెరియర్ విగ్రహం వరకూ రన్ ఫర్ రాజ్యాంగం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కృష్ణా కాలేజ్‌లో రాజ్యాంగ దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో సీఎం జగన్...
వైఎస్ జగన్ విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు..
హైదరాబాద్ లో చంద్రబాబు, లోకేష్..
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో ఉన్నారు. సోమవారంనాడు ఏపీకి తిరిగి రానున్నారు. తెలంగాణ తెలుగుదేశానికి చెందిన కొందరు నేతలకు ఆపాయింట్ మెంట్ ఇచ్చిన కారణంగా వారితో శని, ఆదివారాల్లో వీరు భేటీ కానున్నారు.
27న మంగళగిరి కి పవన్ కళ్యాణ్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మంగళగిరికి రానున్నారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ లో ఇళ్లను కోల్పోయిన బాధితులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై కొద్ది రోజుల క్రితం రగడ నడిచింది. అధికార విపక్షాల మధ్య వార్ నడిచింది.